ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పరంపరకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. ఈ హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ముంబై 12 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో సీజన్ లో రెండో విజయాన్ని ముంబై అందుకుంది. 206 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ, 193 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి కరుణ్ నాయర్ మెరుపులు మెరిపించాడు. అతని ధూంధామ్ ఇన్నింగ్స్‌తో ఓ దశలో ఢిల్లీ గెలుస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్‌కి వచ్చింది. కానీ మిగతా బ్యాటర్లు నిరుత్సాహ పరిచారు. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. కానీ అతను ఔటైన తర్వాత ఢిల్లీ బ్యాటింగ్ క్రమం పూర్తిగా కుదేలైంది. ముంబై బౌలింగ్ దళంలో కర్ణ్ శర్మ 3 కీలక వికెట్లు తీసి విజయానికి బాటలు వేశాడు. సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు.
ఈ ఓటమితో వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన ఢిల్లీకి ఈ సీజన్‌లో తొలి పరాజయం ఎదురైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఒక స్థానం దిగజారి రెండో స్థానానికి చేరింది. గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాప్‌కు ఎగబాకింది. మరోవైపు ముంబై ఇండియన్స్‌కి ఇది రెండో విజయం. ఇప్పటి వరకు మొత్తం ఆరు మ్యాచులు ఆడిన ముంబై నాలుగింటిలో ఓడిపోయినా, ఈ విజయంతో 7వ స్థానానికి చేరింది. ప్లేఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ఇక మిగిలిన మ్యాచుల్లో ముంబైకి నిలకడగా ఆడాల్సిందే.