భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో దేశంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య, క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ను వారం పాటు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయాన్ని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ స్పష్టంగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేస్తున్నాం. భారత ప్రభుత్వంతో సంప్రదించి, భాగస్వాములు, ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలతో చర్చించిన అనంతరం కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం” అని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాలనుబట్టి ఆటగాళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారినా, భారత సైన్యం పట్ల గౌరవం, మద్దతు అన్నింటికంటే ముఖ్యమని బీసీసీఐ వైఖరి స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం సైన్యం చేస్తున్న త్యాగాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ శుక్లా చెప్పారు.
ఈ నేపథ్యంలో గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ప్రేక్షకులను మైదానంలోనుంచి బయటకు పంపించగా, ఆటగాళ్లను తక్షణమే హోటళ్లకు తరలించారు. ఆ మ్యాచ్ నిలిపివేతపై వివరణ ఇస్తూ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమల్ మాట్లాడుతూ, ‘‘మైదానంలో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు విద్యుత్ అంతరాయం, ఫ్లడ్‌లైట్ ఫెయిల్యూర్‌ను సాకుగా వేశారు’’ అని తెలిపారు.
ఇప్పటివరకు IPL 2025లో 58 మ్యాచ్‌లు పూర్తి కాగా, కనీసం 12 లీగ్ మ్యాచ్‌లు ఇంకా మిగిలి ఉన్నాయి. పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేస్తారా లేదా అనేది ఇంకా బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. ఐపీఎల్ మళ్లీ ఎప్పుడూ ప్రారంభమవుతుందో, మిగిలిన మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో అనే విషయాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే, త్వరలోనే తాజా షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.