ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తమ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మెరుపు శతకం, శశాంక్ – యాన్సన్‌ల అద్భుత ఆటతో పంజాబ్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 పరుగులు కొట్టి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తరువాత శశాంక్ సింగ్ (52 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును నిలబెట్టాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్కో యాన్సన్ (34) వేగంగా ఆడి స్కోరు బోర్డును 219కి చేర్చాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2 వికెట్లు), అశ్విన్ (2 వికెట్లు), నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి ఒక్కో వికెట్ తీసారు.
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి వరకు పోరాడినా విజయం మాత్రం దూరమైంది. కెవిన్ కాన్వే (69) సమర్థవంతంగా ఆడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. శివమ్ దూబే (42), రచిన్ రవీంద్ర (36), ధోనీ (27) మెరుపులు మెరిపించినా… నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగుల వద్దే ఆగింది. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ (2 వికెట్లు) ప్రభావం చూపాడు. మ్యాక్స్‌వెల్, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీసి చెన్నై పరుగుల రేటును నియంత్రించారు.
ఈ పరాజయం చెన్నైకి వరుసగా నాలుగో ఓటమిగా నమోదైంది. పాయింట్ల పట్టికలో దిగువకు జారిపోతున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించి తిరిగి తమ జట్టును గెలుపు బాట పట్టించారు.