ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో చివరకు ఢిల్లీ విజయం సాధించింది. మ్యాచ్ 20 ఓవర్లలో 188 పరుగులకే ముగియడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది.
ఈ మ్యాచ్ లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షర్ పటేల్ (34), కేఎల్ రాహుల్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (34) సమష్టిగా మంచి స్కోర్ అందించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసాడు. ఇక లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు ప్రారంభం ఆకట్టుకుంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (51), సంజూ శాంసన్ (31) మెరుపులు మెరిపించారు. మిడిల్ ఆర్డర్‌లో నితీష్ రానా మరో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినా నిర్ణాయక సమయంలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
ఆఖరి ఓవర్‌లో స్టార్క్ మ్యాజిక్:
రాజస్థాన్‌కు విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం కాగా, ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులకే పరిమితం చేశాడు. దాంతో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.
సూపర్ ఓవర్ లో ఢిల్లీ డామినేషన్:
సూపర్ ఓవరల్ లో రాజస్థాన్ తరపున హిట్మేయర్, రియాన్ పరాగ్ బరిలోకి దిగారు. బౌలింగ్ బాధ్యతలు మిచెల్ స్టార్క్ చేపట్టాడు. మొదటి బంతిని డాట్ వేయగా, రెండో బంతికి హిట్మేయర్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి హెట్మేయర్ సింగిల్ తీయగా.. ఆపై పరాగ్ ఫోర్ కొట్టిన బంతి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్ లభించింది. కానీ పరాగ్ రనౌట్ కాగా.. ఆ తర్వాతి బంతికి జైస్వాల్ కూడా రెండో రన్ కోసం వెళ్లే క్రమంలో రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ 11 పరుగులకే పరిమితమైంది.
అనంతరం ఢిల్లీ తరపున కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి దిగారు. బౌలింగ్ చేసిన సందీప్ శర్మ తొలి బంతికి రెండు పరుగులు ఇవ్వగా, రెండో బంతిని రాహుల్ ఫోర్ గా మలిచాడు. ఇక మూడో బంతికి రాహుల్ సింగిల్ తీయగా.. నాలుగో బంతికే స్టబ్స్ భారీ సిక్స్ కొట్టి ఢిల్లీకి విజయం అందించాడు.
2021 తర్వాత ఐపీఎల్‌లో ఇది తొలి సూపర్ ఓవర్ కావడం విశేషం. రెండు జట్లు సమాన బలం కనబరిచినా, చివర్లో ఢిల్లీ కొంచెం మెరుగ్గా ఆడి విజేతగా నిలిచింది.ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆకస్మిక విజయం, రాజస్థాన్ రాయల్స్ తృటిలో చేజారిన గెలుపు అభిమానులను ఉత్కంఠకు గురిచేశాయి.