SRH vs LSG IPL 2026: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ 19లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగింది. హోమ్ గ్రౌండ్‌లో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఐదు వికెట్ల తేడాతో LSG బోణీ కొట్టింది.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-lsg-won-the-toss-and-chose-to-bowl/
టాస్ గెలిచిన లఖ్‌నవూ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. హైదరాబాద్ బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్ కష్టాల్లో పడింది. 11 పరుగులకే టాప్‌ఆర్డర్ విఫలమైంది. వరుసగా 3 వికెట్లు కోల్పోవడంతో స్కోరుపై భారీ ప్రభావం పడింది. డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కావడం, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 7 పరుగులకే ఔట్ కావడం, కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగు చేసి ముగ్గురూ వెనువెంటనే వెనుదిరగడంతో ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు.
దీంతో పది ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే క్లాసెన్, నితీశ్ రెడ్డి అద్భుత పర్ఫామెన్స్‌తో పాటు నిలకడగా ఆడటంతో పాటు హాఫ్ సెంచరీలు చేయడంతో హైదరాబాద్ స్కోరు ముందుకు సాగింది. చివరి 10 ఓవర్లలో 121 స్కోరు సాధించింది. క్లాసెన్(62- 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులు), నితీశ్ రెడ్డి(56- 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లఖ్‌నవూ బౌలర్లలో మహమ్మద్ షమీ 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
157 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన లఖ్‌నవూ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నా.. సరైన సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు కట్టుదిట్టం చేశారు. దీంతో స్కోరును ఛేజ్ చేయడం LSG బ్యాటర్లకు కష్టంగా మారి చివరి ఓవర్ వరకూ పోరాడాల్సి వచ్చింది. పటిష్ఠమైన బౌలింగ్‌తో కీలక వికెట్లు పడగొట్టడంలో సఫలమైనా.. విజయం లఖ్‌నవూని వరించింది. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 పరుగులు- నాటౌట్), ఐడెన్ మార్‌క్రమ్(45) అద్భుత పర్ఫామెన్స్‌తో రాణించారు. అబ్దుల్ సమద్(16) రన్స్ చేశాడు. దీంతో జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో హర్ష్ దుబె 2, శివాంగ్ కుమార్ 2, మలింగ ఒక వికెట్ తీశారు.

