RCB vs SRH: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. దాదాపు రెండు నెలల పాటు క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు ఈ క్రికెట్ లీగ్ సిద్ధమైంది. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు.
తొలి మ్యాచ్‌లోనే హై-వోల్టేజ్: శనివారం బెంగళూరు వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. గత ఏడాది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి కప్పు గెలిచిన ఆర్సీబీ.. ఈసారి అదే జోరును కొనసాగించి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే మరోవైపు ఆరెంజ్ ఆర్మీ సైతం రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Also read-IPL-2026: నీ బిడ్డ తిరిగొచ్చాడు.. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్!
రికార్డులపై కన్నేసిన దిగ్గజ జట్లు: ఈసారి ఐపీఎల్ వేదికగా పలు ఆసక్తికర రికార్డులు బద్దలుకానున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) జట్లు ఆరోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన నాలుగో ట్రోఫీపై కన్నేసింది. హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండోసారి చాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తమ తొలి టైటిల్ కలని నెరవేర్చుకోవాలని కసితో ఉన్నాయి. మరి ఈ రసవత్తర పోరులో మే 31న విజేతగా నిలిచి ఐపీఎల్ కిరీటాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో వేచి చూడాల్సిందే!

