ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు, అది ఓ భారీ వినోదం. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా క్రికెటర్లు ఫోర్లు, సిక్సర్లతో మెరుస్తే, స్టేడియంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మరొక ప్రధాన ఆకర్షణ చీర్ లీడర్లు. బ్యాట్స్‌మెన్ సిక్సర్ కొట్టినా, బౌలర్ వికెట్ తీసినా, వీరి ఎనర్జీతో కూడిన డ్యాన్స్ స్టేడియాన్ని.. ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తారు. ఇక ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు ఓ ప్రత్యేకమైన చీర్ లీడర్ల గ్రూప్ ఉంటుంది. వీరు తమ జట్టు గెలవాలని ప్రోత్సహిస్తూ, మ్యాచ్ మొత్తంలో ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. క్రికెట్ అభిమానులకు చీర్ లీడర్లు ఆటను మరింత ఆసక్తికరంగా అనుభవించేలా చేస్తారు. అయితే వీరి జీతం ఎంత.. ఏ ఫ్రాంచైజీ ఎక్కువ ఇస్తుంది. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో ఒక్కో చీర్ లీడర్ ప్రతి మ్యాచ్‌కు రూ.14,000 నుండి 25,000 వరకు జీతం పొందుతారు. కానీ ప్రతి ఫ్రాంచైజీ తమ చీర్ లీడర్లకు వేర్వేరు రేట్లు చెల్లిస్తుంది. ఒక సీజన్ మొత్తానికి చీర్ లీడర్ల జీతం కనీసం రూ.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
చీర్ లీడర్లకు అత్యధికంగా జీతం చెల్లించే జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్. షారుక్ ఖాన్ యాజమాన్యంలోని ఈ ఫ్రాంచైజీ తన చీర్ లీడర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.25 వేల వరకు చెల్లిస్తోంది. ఇక ఐదు టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ చీర్ లీడర్లకు రూ.20 వేల జీతం ఇస్తుందంట. ఇదే మొత్తాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెల్లిస్తోందని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తమ చీర్ లీడర్లకు మ్యాచ్‌కు రూ.15 వేల వరకు జీతం అందిస్తుందని ఓ అంచనా.. ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు ఒక్కో మ్యాచ్‌కు రూ.12 వేల వరకు చెల్లిస్తున్నాయని తెలుస్తోంది.
2024 ఐపీఎల్ సీజన్ ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీనితో పాటు చీర్ లీడర్ల లో సీనియర్స్, జూనియర్స్ ఆధారంగా కూడా రేట్లు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఐపీఎల్‌లో క్రికెటర్లతో పాటు, చీర్ లీడర్లు కూడా అభిమానులను ఆకట్టుకునేలా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.