Ishan Kishan : అందివచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషాన్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. రోహిత్ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌కు పట్టపగలే చుక్కలు చూయించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీకి తరలించి ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులను ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ 23 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేశాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తరువాత వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు డబుల్ సెంచరీ సాధించిన ఏడో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో మార్టిన్ గుప్టిల్, క్రిస్‌గేల్, ఫఖర్ జమాన్ కూడా ఉన్నారు.
అందరికంటే వేగంగా ద్విశతకం
వన్డేల్లో అందరి కంటే వేగంగా వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్ డబుల్ సెంచరీ సాధించాడు. అయితే.. దాన్ని ఇషాన్ కిషన్ బ్రేక్ చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 138 బంతుల్లో గేల్ డబుల్ సెంచరీ చేయగా ఇషాన్ కిషన్ 126 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.