Aaqib Nabi: భారత క్రికెట్ జట్టులో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబి తొలిసారి చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. గాయం కారణంగా శ్రీలంక పర్యటన నుంచి స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వైదొలగాడు. దీంతో అతడి స్థానంలో లంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు సెలక్షన్ కమిటీ ఆకిబ్ నబిని ఎంపిక చేసింది. ఈ అరుదైన ఘనత ద్వారా కశ్మీర్ నుంచి భారత టెస్టు జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా నబి అరుదైన రికార్డు సృష్టించాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ఈ నెల 15న ప్రారంభం కానుంది.
అంచెలంచెలుగా ఎదిగిన ఆకిబ్ నబి: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన 29 ఏళ్ల ఆకిబ్ నబి.. పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత టీమిండియాకు ఎంపికైన మూడో జమ్మూకశ్మీర్ ఆటగాడిగా నిలిచాడు. కాగా రసూల్, మాలిక్‌లు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడగా.. టెస్టు జట్టుకు ఎంపికైంది మాత్రం నబి కావడం విశేషం. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన నబి ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2025-26 రంజీ సీజన్లో అసాధారణ బౌలింగ్‌తో 60 వికెట్లు తీసి జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన భారత్-ఎ జట్టులోనూ నబి సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీస్‌లో ఆడిన రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రతిభ కనబరిచిన నబికి ఇప్పుడు జాతీయ జట్టులో తగిన గుర్తింపు లభించింది.
Also read-Cricketer : అశ్విన్‌కు అర్షదీప్ క్షమాపణలు.. ఎందుకంటే..?

