Japan Open 2025: జపాన్ ఓపెన్ ఆడుతున్న సాత్విక్-చిరాగ్ ద్వయం ఇంటి బాట పట్టింది. టోక్యో వేదికగా గురువారం జరిగిన జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్‌లో ఓడిపోయింది. చైనాకు చెందిన వాంగ్ చాంగ్, లియాంగ్ వీ కెంగ్ పై భారత్ కు చెందిన మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి పరాజయం చవిచూశారు. దీంతో వీరిద్దరూ జపాన్ సూపర్ 750 టోర్నీ నుంచి నిష్క్రమించారు.
రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో ఐదో సీడ్ కు చెందిన చైనా టీమ్ పై 44 నిమిషాల పాటు ఆడారు. ఇదే పోరులో భారత జోడీ 22-24, 14-21 పాయింట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ రిజల్ట్‌తో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన వాంగ్ చాంగ్, వీ కెంగ్‌లు తమ హెడ్-టూ-హెడ్ రికార్డును 7-2 పాయింట్లకు పెంచుకున్నారు.
ఈ మ్యాచ్ ప్రారంభంలో సాత్విక్, చిరాగ్ ఒకింత ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 18-14 పాయింట్ల ఆధిక్యం ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఆట ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లింది. అదే ఉత్సాహాన్ని కొనసాగించలేక.. చివరకు వాంగ్ చాంగ్, వీ కెంగ్ లపై వరుసగా నాలుగో ఓటమిని చవిచూశారు.


