ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఆఫ్ఘనిస్థాన్ భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఇంగ్లండ్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. కానీ ఆఫ్ఘన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లీష్ జట్టును ఎనిమిది పరుగుల తేడాతో ఓడించారు. దీంతో ఆ టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్ల 325/7 పరుగుల స్కోర్ చేసింది. 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు తడబడింది. వికెట్లు కోల్పోతున్న సమయంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) మరోసారి తన ఆటతీరుతో అదరగొట్టాడు. సింగిల్స్, ఫోర్లతో సెంచరీ(120) చేశాడు. చివరి వరకు జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు.
అయితే రూట్ ఔట్ తర్వాత ఆఖరి రెండు ఓవర్లలో ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపమే మార్చేశారు. ఈ పరాజయంతో ఇంగ్లండ్ ఇంటిముఖం పట్టింది. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రూట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.