Joe Root Overtakes Ponting: ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జో రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించి, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ అద్భుతమైన ఘనతతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో రూట్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానంలో నిలిచాడు.
ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా రూట్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 201 బాల్స్ ఆడి 121 పరుగులతో రూట్ అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇప్పటికీ రారాజు సచినే..
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెందూల్కర్ ఉన్నాడు. 200ల టెస్టులు ఆడిన సచిన్.. 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 శతకాలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో 168 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్.. 51.85 సగటుతో 13,378 పరుగులు చేశాడు. పాంటింగ్ 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు సాధించాడు.
తాజాగా ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న రూట్.. 51.26 సగటుతో 157 టెస్టుల్లోనే 13,380 పరుగులు చేశాడు. అందులో 38 శతకాలు, 66 అర్థ శతకాలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ స్కోరు 262.
సచిన్‌ను అధిగమిస్తాడా..?
ఈ ఘనత సాధించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు రూట్‌కు ప్రశంసలు కురిపిస్తున్నారు. రూట్‌ని ప్రశంసిస్తూ అతడు సచిన్ టెందూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు పాంటింగ్.
జో రూట్ తన నిలకడైన ఆటతీరు, సాంకేతికంగా పటిష్టమైన బ్యాటింగ్ శైలితో టెస్ట్ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, బ్రయాన్ లారా, కుమార్ సంగక్కర, రాహుల్ ద్రవిడ్ వంటి వారందరినీ దాటి ఇప్పుడు కేవలం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మాత్రమే అధిగమించాల్సి ఉంది. రూట్ ఫామ్, వయస్సును బట్టి చూస్తే, అతను సచిన్ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


