Kakinada: హాకీ జూనియర్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్-2025 కి కాకినాడ ఆతిధ్యం వహించింది. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాగణం వేదికగా ఆస్ట్రో హాకీ ఫీల్డ్‌లో గత 12 రోజులుగా చాంపియన్‌షిప్ నిర్వహించబడింది. ఈ పోటీలలో దేశం నలుమూలల నుండి 30జట్లు పాల్గొన్నాయి.
చివరి మ్యాచ్ లో జార్ఖండ్ – హర్యాన జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో జార్ఖండ్ జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. చాంపియన్‌గా జార్ఖండ్, రన్నర్ అప్ గా హర్యాన జట్లు నిలిచాయి. మూడో స్థానానికి జరిగిన పోటీలో ఉత్తరప్రదేశ్ జట్టు, చత్తీస్‌గఢ్‌పై 2-0 గోల్స్‌తో విజయం సాధించి కాంస్య పతకం సాధించింది.
Read more: https://teluguprabha.net/sports-news/national-boxing-championship-haryana-top-boys-girls/
ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, బ్రిగేడియర్ రాకేష్ శర్మ ఆవాస్తి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చాంపియన్‌గా నిలిచిన జార్ఖండ్ జట్టు సభ్యులకు కాకినాడ ప్రత్యేకతను గుర్తు చేసే విధంగా పెద్దాపురం సిల్క్ శారీలు బహుమతులుగా అందజేశారు.
ఈ భారీ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ముందుండి వ్యవస్థాపకంగా వ్యవహరించిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఆహార ఏర్పాట్లు, వసతి, భద్రత, రవాణా వంటి అంశాల్లో చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి. శ్రీనివాస్ కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ వి.రవిరాజు కృషిని ప్రత్యేకంగా గుర్తించారు.
Read more: https://teluguprabha.net/sports-news/indian-shuttlers-handed-tough-draw-at-worlds-championship-2025/
జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ.. గెలుపు-ఓటములు సర్వసాధారణం. కానీ పోరాట స్ఫూర్తితో ఆడటమే అసలైన గెలుపు అని తెలిపారు. జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఈ జూనియర్ క్రీడాకారులలో కొందరు రేపటి రోజున అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా టోర్నమెంట్ లో పాల్గొని ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారని అన్నారు.


