బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టడంలో రోహిత్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ రోహిత్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై హిట్ మ్యాన్ స్పందించాడు.
రెండో రోజు ఆటలంచ్ బ్రేక్ సమయంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి మాట్లాడాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని.. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నానని స్పష్టం చేశాడు. టీవీల ముందు కూర్చొని ఏదో ఏదో మాట్లాడుతున్నారని.. ఇద్దరి పిల్లల తండ్రి అయిన తనకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసన్నారు. ఫామ్‌లో లేనందునే సిడ్నీ టెస్టుకు దూరమయ్యానని తెలిపాడు. కొన్ని సమయాల్లో జట్టు అవసరాల కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. త్వరలోనే మంచి ఫామ్‌తో జట్టులోకి తిరిగివస్తానంటూ తేల్చి చెప్పాడు. రిటైర్మెంట్ తీసుకోవడం లేదని రోహిత్ స్పష్టం చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.