HomeTop Storiesఎఫ్‌1 రారాజు కిమీ ఆంటోనెల్లి..

ఎఫ్‌1 రారాజు కిమీ ఆంటోనెల్లి..

మెక్సికో సిటీ, నవంబర్‌ 2: ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సరికొత్త అధ్యాయం లిఖించాడు. మెర్సిడెస్‌కు చెందిన ఈ 20 ఏళ్ల ఇటలీ డ్రైవర్‌ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలిచి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ను ఖరారు చేసుకున్నాడు. టైటిల్‌ సాధించేందుకు తొమ్మిదో స్థానం సరిపోయినా, పోడియంపై నిలిచి తన ఆధిపత్యాన్ని చాటాడు. ఆంటోనెల్లి 20 ఏళ్ల 68 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. 2010లో 23 ఏళ్ల 134 రోజుల వయసులో చాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్‌ వెటెల్‌ రికార్డును అధిగమించాడు. 1953లో ఆల్బెర్టో ఆస్కారి తర్వాత ఎఫ్‌1 ప్రపంచ టైటిల్‌ గెలిచిన తొలి ఇటలీ డ్రైవర్‌గా కూడా నిలిచాడు.

- Advertisement -

71 ల్యాప్‌ల మెక్సికో రేసులో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. లూయిస్‌ హామిల్టన్‌ రెండో స్థానంలో, ఆంటోనెల్లి మూడో స్థానంలో నిలిచారు. వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్‌లో ఇది మూడో విజయం కాగా, మెక్సికో సర్క్యూట్‌పై ఆరోసారి గెలిచాడు. రేసు మధ్యలో వాల్టెరి బొటాస్‌ కారు ప్రమాదానికి గురవడంతో రెడ్‌ ఫ్లాగ్‌ ప్రకటించారు. చివరి దశలో ఆర్విడ్‌ లిండ్‌బ్లాడ్‌ ప్రమాదంతో సేఫ్టీ కార్‌ కూడా రంగంలోకి దిగింది. ఈ అంతరాయాల మధ్యనూ ఆంటోనెల్లి ప్రశాంతంగా రేసును పూర్తి చేసి చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. తదుపరి రేసులు బ్రెజిల్‌లో కొనసాగనున్నాయి.

సాధించాం.. సాధించాం!

రేసు ముగింపు గీత దాటిన తర్వాత ఆంటోనెల్లి భావోద్వేగానికి గురయ్యాడు. ‘సాధించాం.. సాధించాం’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించడం జీవితాంతం గుర్తుండిపోతుందని తెలిపాడు. చివరి ల్యాప్‌లో ఉత్కంఠ, భావోద్వేగాల కారణంగా ముందున్న ట్రాక్‌ సరిగా కనిపించలేదని నవ్వుతూ చెప్పాడు.

టైర్ల కుప్ప నుంచి.. ఎఫ్‌1 చాంపియన్‌

ఆంటోనెల్లి తండ్రి మార్కో స్పోర్ట్స్‌కార్‌ రేసర్‌. 2014 జర్మన్‌ గ్రాండ్‌ప్రిలో ఆయన బృందం సహాయక రేసులో పాల్గొంది. అప్పటికి ఏడేళ్ల వయసున్న ఆంటోనెల్లికి ఎఫ్‌1 ప్యాడాక్‌ను చూడాలని ఉన్నా అనుమతి లభించలేదు. దీంతో టైర్ల మధ్య ఇరుక్కుని లోపలికి వెళ్లాడు. అనుమానం రాకుండా పైన గొడుగు కూడా కప్పుకున్నానని ఆంటోనెల్లి తర్వాత గుర్తుచేసుకున్నాడు. చిన్ననాటి నుంచే కార్టింగ్‌లో ప్రతిభ చూపిన అతడిపై ఫెరారీ దృష్టి పడింది. అయితే 11 ఏళ్ల వయసులో జరిగిన చర్చలు ఫలించలేదు. అనంతరం మెర్సిడెస్‌ యువ డ్రైవర్ల కార్యక్రమంలో చేరిన ఆంటోనెల్లి కార్టింగ్‌ పోటీల్లో రాణించాడు. 2021లో కార్ల రేసింగ్‌కు మారిన తర్వాత కూడా పలు టైటిళ్లు సాధించాడు.

హామిల్టన్‌ స్థానంలో అవకాశం

ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఫెరారీకి వెళ్లడంతో మెర్సిడెస్‌ అతడి స్థానంలో ఆంటోనెల్లికి అవకాశం కల్పించింది. అప్పటి నుంచే అతడిని మాక్స్‌ వెర్‌స్టాపెన్‌, సెబాస్టియన్‌ వెటెల్‌ వంటి దిగ్గజాలతో పోల్చడం మొదలైంది. ఎఫ్‌1లో అతి పిన్న వయసులో చాంపియన్‌గా నిలిచిన వెటెల్‌ రికార్డును అధిగమించే అవకాశం ఉన్న యువ డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. ఆంటోనెల్లి అసలు పేరు ఆండ్రియా. 2006లో అతడు జన్మించినప్పుడు కుటుంబ స్నేహితుడి సూచనతో ‘కిమీ’ అనే మధ్య పేరును పెట్టారు. అప్పట్లో ఫిన్లాండ్‌కు చెందిన కిమీ రైక్కోనెన్‌ ఎఫ్‌1లో ప్రముఖ డ్రైవర్‌గా ఉన్నాడు. అయితే తన పేరు ఆయనకు నివాళిగా పెట్టింది కాదని ఆంటోనెల్లి స్పష్టం చేశాడు.

ప్రమాదంతో అరంగేట్రం

2024లో మోంజా గ్రాండ్‌ప్రి ప్రాక్టీస్‌ సెషన్‌లో మెర్సిడెస్‌ తరఫున కారును నడిపిన ఆంటోనెల్లి ప్రమాదానికి గురై గోడను ఢీకొట్టాడు. 18 ఏళ్ల వయసులో ఎఫ్‌1 రేసుల్లో అరంగేట్రం చేశాడు. తొలి సీజన్‌లో మయామి గ్రాండ్‌ప్రిలో అత్యంత పిన్న వయసులో పోల్‌ పొజిషన్‌ సాధించిన డ్రైవర్‌గా రికార్డు సృష్టించినా, తప్పిదాలు, వరుస పేలవ ఫలితాలతో ఇబ్బందిపడ్డాడు. ఆ సమయంలో ఒత్తిడికి లోనై తనను నమ్మినవారిని నిరాశపరిచానని ఆంటోనెల్లి అంగీకరించాడు.

పుంజుకుని.. ఐదు విజయాలతో

తన ప్రదర్శనను సమీక్షించుకుని 2026 సీజన్‌కు కొత్త లక్ష్యంతో సిద్ధమయ్యాడు. మార్చిలో చైనా గ్రాండ్‌ప్రిలో తొలి విజయం సాధించి సత్తా చాటాడు. ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగిస్తూ ఈ సీజన్‌లో ఐదు రేసుల్లో గెలిచాడు. ఇటలీ గ్రాండ్‌ప్రిలో ఇంజిన్‌ పెనాల్టీ కారణంగా 19వ స్థానం నుంచి రేసును ప్రారంభించినా, అద్భుతంగా పోరాడి విజయం సాధించాడు.

కొత్త నిబంధనలు.. కలిసొచ్చిన డ్రైవింగ్‌ శైలి

దశాబ్దాల్లోనే అతిపెద్ద మార్పులతో వచ్చిన 2026 ఎఫ్‌1 నిబంధనలు అనుభవజ్ఞులైన డ్రైవర్లకూ సవాలుగా మారాయి. విద్యుత్‌-హైబ్రిడ్‌ శక్తిపై ఎక్కువగా ఆధారపడే కొత్త కార్లకు ఆంటోనెల్లి దూకుడైన డ్రైవింగ్‌ శైలి, సహజమైన కారుపై నియంత్రణ సరిపోయాయి. జారే ట్రాక్‌లపై అతడి ప్రతిభ కూడా కలిసొచ్చిందని సహచర డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ పేర్కొన్నాడు. ఈ ప్రదర్శనతో ఆంటోనెల్లి 20 ఏళ్లకే ఎఫ్‌1 ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆంటోనెల్లిపై ఎఫ్‌1 అధ్యక్షుడి ప్రశంసలు

ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) చరిత్రలో అత్యంత తక్కువ వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కిమీ ఆంటోనెల్లిపై ఫార్ములా వన్‌ క్రీడల అధ్యక్షుడు, సీఈఓ స్టెఫానో డొమెనికాలి ప్రశంసలు కురిపించారు. అంకితభావం, నమ్మకం, కఠోర శ్రమతో సాధించలేనిదంటూ ఏదీ లేదని ప్రపంచవ్యాప్తంగా యువతకు ఆంటోనెల్లి చాటిచెప్పాడని కొనియాడారు. ‘ప్రతిభ, ధైర్యం, పట్టుదలతో ఆంటోనెల్లి ఈ అసాధారణ విజయాన్ని అందుకున్నాడు. రికార్డులతోనే గొప్పతనాన్ని కొలవలేం.. కొత్త తరాలకు స్ఫూర్తినివ్వడంలోనూ అది కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతడిని చూసి యువత తమ పెద్ద కలలను నిజం చేసుకోవచ్చనే నమ్మకాన్ని పొందుతారు’ అని స్టెఫానో అన్నారు. ఎఫ్‌1 చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని, ఆంటోనెల్లి ప్రస్థానం ఇప్పుడే ప్రారంభమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘనతలో భాగస్వాములైన మెర్సిడెస్‌ జట్టు, ఆంటోనెల్లి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఇటలీ దేశవ్యాప్తంగా సంబురాలు

కిమీ ఆంటోనెల్లి ఫార్ములా వన్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో ఇటలీ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. టెన్నిస్‌ స్టార్‌ జానిక్‌ సిన్నర్‌ ‘మమ్మా మియా కిమీ! నువ్వు సాధించిన ఘనత అద్భుతం. ఇటలీ మొత్తం నీ గురించి గర్విస్తోంది’ అంటూ వీడియో సందేశం పంపాడు. మోటార్‌సైక్లింగ్‌ దిగ్గజం వాలెంటినో రోస్సీ, ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌ ఫెడెరికా పెల్లెగ్రినీ కూడా ఆంటోనెల్లిని అభినందించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ విజయాన్ని దేశానికి గర్వకారణంగా అభివర్ణించారు. ఆంటోనెల్లి స్వస్థలమైన బొలోగ్నా నగరం అతడికి అత్యున్నత పౌర పురస్కారం ‘గోల్డెన్‌ నెప్ట్యూన్‌’ అందించనున్నట్లు ప్రకటించింది. అతడు పెరిగిన ప్రాంతంలోని ఓ థియేటర్‌లో 200 మందికి పైగా అభిమానులు పెద్ద తెరపై రేసును వీక్షించారు. ప్రస్తుతం అతడు నివసిస్తున్న శాన్‌ మారినోలోనూ స్నేహితులు, అభిమానులు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News