Friday, November 22, 2024
HomeఆటKites wala: పతంగ్ వాలాలకు సలామ్ చెప్పాల్సిందే..

Kites wala: పతంగ్ వాలాలకు సలామ్ చెప్పాల్సిందే..

మకర సంక్రాంతి పండుగలో ప్రత్యేక ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో గాలిపటాలు ఎగరవేయడం ఒకటి. దేశంలో పలుచోట్ల సంక్రాంతి పండగకు చిన్నా, పెద్దా అంతా ఇంటి మేడలెక్కేసి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పల్లెల్లో, నగరాల్లో అంతటా గాలిపటాల సందడి బాగా కనిపిస్తుంది.

- Advertisement -

గాలిపటాలను ఎగరవేస్తుంటే కలిగే ఎంజాయ్మెంటే వేరు. అది మాటలకు అందనిది. ఆకాశాన్నంటే ఆనందాన్ని పంచే పండుగ సంబరం అది. అలాంటి రంగురంగుల గాలిపటాల తయారీలో పేరున్న ఒక షాపు బాంద్రాలో ఉంది. దాని గురించి ఈ పండుగ నాడు తెలుసుకోవాల్సిందే.

ఆ షాపు నిర్వహించే వ్యక్తి బాలివుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ల సినిమాలకు సైతం గాలిపటాలు తయారుచేశారు. ఈ షాపుకున్న గాలిపటాల చరిత్ర ఇప్పటిది కాదు. 1952 నుంచి వెరైటీ గాలిపటాల తయారీలో ఈ షాపు కు మంచి పేరు ఉంది. తరతరాలుగా గాలిపటాల తయారీ బిజినెస్ ను నిర్వహిస్తున్న కుటుంబం వారిది. ఆ షాపు యజమాని పేరు అహ్మద్ కాజి. వారి కుటుంబం ఏడు దశాబ్దాలుగా గాలిపటాలను తయారుచేస్తూ ఎందరికో అమ్ముతున్నారు.

అహ్మద్ తండ్రి, సోదరులతో కలిసి ఈ బిజినెస్ చేయడం ప్రారంభించారు. 1930ల లోనే అహ్మద్ తాత ఆగ్రా నుంచి ముంబయికి వచ్చి గాలిపటాల బిజినెస్ కు శ్రీకారం చుట్టారుట. బాద్రాలోని చాలామంది అతన్ని ‘అహ్మద్ పతంగ్ వాలా’ అని పిలుస్తారు. పండుగ రావడానికి రెండు నెలల ముందు నుంచే అహ్మద్ గాలిపటాల అమ్మకాలను మొదలెడతారు. గతంలో ఆగస్ట్ 15 వేడుకల నుంచి గాలిపటాల సందడి ఉండేదిట. అయితే రాను రాను ఆ సందడి తగ్గినా గాలిపటాలు ఎగరవేయడంలోని మజా జనాల్లో ఇంకా పోలేదని అహ్మద్ అంటారు. గాలిపటాలను రకరకాల సైజుల్లో, వినూత్న ఆకారాల్లో ఆయన తయారుచేస్తారు. మురికివాడల్లోని చిన్నారులు వీటితో బాగా ఆడతారని అహ్మద్ చెప్తారు. నగరాల్లో స్థలం కొరవడడం వల్ల కూడా గాలిపటాలు ఎగరవేయడం తక్కువైందని అహ్మద్ అంటారు.

సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా, షారుఖ్ ఖాన్ ‘రయూస్’, ‘పటాన్’ సినిమాల్లో కనిపించే రంగు రంగు గాలిపటాలు అహ్మద్ చేతుల నుంచి తయారైనవే. అంతేకాదు గాలిపటాల తయారీలో అహ్మద్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. వినియోగదారుల కోరికల కనుగుణంగా కూడా పెద్ద ఎత్తున గాలిపటాలను తయారుచేసి అహ్మద్ అందిస్తారు.

ఉదాహరణకు అహ్మద్ ఛోటా భీమ్, పుష్ప లాంటివి అలా తయారు చేసినవే. ఇటీవల ముంబయిలోని పొవై, దుబాయ్, సింగపూర్ లలో ఉంటున్న గుజరాతీ కమ్యూనిటీవారికి పెద్ద ఎత్తున గాలిపటాలను తయారుచేసి ఇచ్చారు. గాలిపటాలకు డిమాండు తగ్గినా వాటిని తయారుచేయడం ఆపేది లేదని అహ్మద్ అంటారు. అదే తన జీవనాధారం అని అహ్మద్ చెప్తారు. అయినా గాలిపటాల గ్లోరీ అంత సులభంగా కనుమరుగయ్యేది కాదని కూడా ఆయన అంటారు. సంక్రాంతి పండుగకు దేశమంతటా అహ్మద్ లాంటి ఎందరో పతంగ్ వాలాలు ప్రజలకు పంచుతున్న రంగురంగుల గాలిపటాల శోభకు సలామ్ కొట్టాల్సిందే…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News