భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతుల జీవితంలో కొత్త వెలుగులు నింపిన ఆనంద ఘడియలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ పాపతో ఉన్న ఫస్ట్ ఫొటోను పుట్టినరోజు కానుకగా ప్రపంచానికి చూపించిన రాహుల్, కూతురికి పెట్టిన పేరుతో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. ఇవాళ కేఎల్ రాహుల్ పుట్టిన రోజు ఈ సందర్భంగా రాహుల్ – అతియా శెట్టి దంపతులు తమ కూతురి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఆమెకు “ఇవారా” అనే పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఫొటోలో రాహుల్, అతియా ఇద్దరూ తమ చిన్నారి పాపను ప్రేమగా ఎత్తుకుని ఉన్నారు.
ఇవారా అంటే దేవుడి వరం అని అర్ధమని ఈ జంట తెలిపింది. ఇవారా అనే పేరు సంస్కృత మూలాలనుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం దీని అర్ధం. ఇక ఈ పోస్ట్‌పై అభిమానులు సహా సెలెబ్రిటీలు కూడా తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. నటి సమంత, “లవ్ లవ్ లవ్” అంటూ మూడు ఎమోజీలు సెండ్ చేసింది. పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు, అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కేఎల్ రాహుల్ – అతియా శెట్టి జంట 2023లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల మార్చి 25న అతియా పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆ పాపకు సంబంధించిన వివరాలేవీ బయట పెట్టని ఈ దంపతులు, రాహుల్ పుట్టినరోజును ప్రత్యేకంగా ఫోటో విడుదల చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్న రాహుల్, ఆటలోనూ, జీవితంలోనూ తనదైన శైలిలో మెరిసిపోతున్నాడు. ఇక “ఇవారా”తో ఈ స్టార్ దంపతులు మురిసిపోతున్నారు.