KL Rahul : టీమ్ఇండియాను గాయాలు వదలడం లేదు. రెండో టెస్టుకు సిద్దం అవుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడి చేతికి దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు. ప్రస్తుతం రాహుల్ గాయాన్ని బీసీసీఐ వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు చెప్పాడు.
‘గాయం అంత తీవ్రమైనది అయితే ఏమీ కాదు. రాహుల్ కోలుకున్నట్లే అనిపిస్తుంది. డాక్టర్లు గాయాన్ని పరిశీలిస్తున్నారు. రేపటి మ్యాచ్‌కు రాహుల్ అందుబాటులోనే ఉంటాడని ఆశిస్తున్నా.’ అని విక్రమ్ రాథోడ్ అన్నారు. ఒక వేళ రాహుల్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అయితే సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మూడో వన్డేతో పాటు టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. రోహిత్ స్థానంలో రాహుల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కెప్టెన్‌గా నియమించింది. రాహుల్ సారథ్యంలో తొలి టెస్టులో టీమ్ఇండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
ప్రపంచటెస్ట్ ఛాంపియన్ టెస్టు సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే భారత జట్టు గురువారం నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.