Ind vs Ban 1st test : బంగ్లాదేశ్ పర్యటనలో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా టెస్టు సిరీస్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బావిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నేటి నుంచి ఆరంభమైంది. చటోగ్రామ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హజరీలో కేఎల్ రాహుల్ ఈ టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
భారత జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా(వైఎస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్
బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఈ మ్యాచ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సవాల్ కానుంది. తన బ్యాటింగ్ ప్రదర్శనను మెరుగుపరచుకోవడంతో పాటు వ్యూహాలను అమలు చేసి జట్టును గెలిపించాల్సిన బాధ్యత అతడిపై ఉంది. రహానే, రోహిత్ శర్మ, జడేజా వంటి ఆటగాళ్లు దూరం కావడంతో జట్టును ఎలా నడిపిస్తాడు అన్నది ఆసక్తికరం. గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరం అయిన పంత్.. తనకు అచ్చొచ్చిన టెస్టు ఫార్మాట్‌లోనైనా ఫామ్ అందుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ టీమ్ఇండియా విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో రెండు, ఆ తరువాత ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై నాలుగు టెస్టుల్లోనూ గెలిస్తేనే ఎలాంటి సమీకరణాలు లేకుండా భారత్ ఫైనల్ చేరుకుంటుంది.