HomeఆటMessi : మెస్సి ముచ్చట.. ముంచిన గందరగోళం: 33 వేల మందికి టికెట్ డబ్బులు వాపసు

Messi : మెస్సి ముచ్చట.. ముంచిన గందరగోళం: 33 వేల మందికి టికెట్ డబ్బులు వాపసు

Lionel Messi Kolkata event ticket refund : ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సి మైదానంలో చేసే విన్యాసాలను కళ్లారా చూసి తరించాలని వేలాది రూపాయలు వెచ్చించిన అభిమానులకు నాడు మిగిలింది తీవ్ర నిరాశ, ఆవేదన మాత్రమే.. నిర్వాహకుల అస్తవ్యస్త ఏర్పాట్లు, వీఐపీల ప్రచార యావ కారణంగా కేవలం పది నిమిషాల్లోనే ముగిసిన ఆ చేదు ఘటనకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది.

- Advertisement -

33 వేల మందికి పూర్తి రీఫండ్: కోల్‌కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ‘గోట్ టూర్’ గందరగోళంపై ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. మెస్సి మ్యాచ్ కోసం రూ.4,000 నుంచి రూ.8,000 వరకు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన దాదాపు 33,000 మంది అభిమానులకు ప్రభుత్వ క్రీడా నిధి నుంచి సొమ్మును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలోనే రీఫండ్ మొత్తాన్ని జమ చేస్తామని స్పష్టం చేశారు.

అత్యుత్సాహంతోనే ఆగమాగం: రాజకీయ నాయకులు, వీఐపీలు సెల్ఫీలు, ప్రచారం కోసం మెస్సి చుట్టూ గుమిగూడటంతో తీవ్ర అసౌకర్యానికి గురైన మెస్సి క్షణాల్లో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు మైదానంలోకి చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించగా, నిర్వాహకులపై కేసులు కూడా నమోదయ్యాయి.

క్రీడా రంగానికి నయా జవసత్వాలు: గత పాలకుల నిర్లక్ష్యం, మితిమీరిన రాజకీయ జోక్యంతో రాష్ట్రంలో క్రీడారంగం కునారిల్లిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. లోపాలను సరిదిద్ది రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ఆధునిక మినీ ఇండోర్ స్టేడియాలను నిర్మిస్తామని, మొదటి విడతలో 100 స్టేడియాలను పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ప్రతిభను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి క్లబ్బులకు ఏటా రూ. 1 కోటి ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News