ప్రపంచ మహిళా చెస్ విజేత, తెలుగుతేజం కోనేరు హంపిని మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలోని వారి నివాసంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
గత డిసెంబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో జరిగిన వరల్డ్ ర్యాపిడ్ ఉమెన్ చెస్ ఛాంపియన్‌షిప్-2024లో కోనేరు హంపి ప్రపంచ విజేతగా నిలిచిన విషయం విదితమే. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ ఆమెను కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. ప్రపంచ మహిళా చెస్ విజేతగా నిలిచి తెలుగుజాతి కీర్తిప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తినివ్వాలని కోరుతూ శాప్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ హంపి విజయం ఆమె పట్టుదల, అంకితభావం, సంకల్పానికి నిదర్శనమని, ముఖ్యంగా యావత్ తెలుగుజాతికి గర్వకారణమని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ పాలసీలను శాప్ ఛైర్మన్ ఆమెకు వివరించారు. ఏపీ క్రీడాభివృద్ధికి మీ సూచనలు, సలహాలు అందజేయాలని శాప్ ఛైర్మన్ ఆకాంక్షించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గారిని కలుస్తానని, ఏపీ క్రీడాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు.