Sunday, October 6, 2024
HomeఆటMarnus Labuschagne : అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్న ల‌బూషేన్‌

Marnus Labuschagne : అరుదైన జాబితాలో చోటు ద‌క్కించుకున్న ల‌బూషేన్‌

Marnus Labuschagne : వెస్టిండీస్ జ‌ట్టుతో పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట‌గాడు మార్న‌స్ ల‌బూషేన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ద్విశ‌త‌కం బాదిన ల‌బూషేన్ రెండో ఇన్నింగ్స్‌లో శ‌త‌కం చేశాడు. త‌ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘ‌న‌త సాధించిన ఎనిమిదో ఆట‌గాడిగా, మూడో ఆసీస్ బ్యాట‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 350 బంతులు ఆడిన ల‌బూషేన్ 20 ఫోర్లు, ఓ సిక్స‌ర్ బాది 204 ప‌రుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 104 ప‌రుగుల‌తో నాటౌట్‌గా ఉన్నాడు.

- Advertisement -

ల‌బూషేన్ కంటే ముందు డౌగ్ వాల్ట‌ర్స్‌, గ్రెగ్ ఛాపెల్‌(ఆస్ట్రేలియా), లారెన్స్ రోవ్‌, బ్రియాన్ లారా(వెస్టిండీస్‌), సునీల్ గ‌వాస్క‌ర్‌(ఇండియా), గ్ర‌హం గూచ్‌(ఇంగ్లాండ్‌), కుమార సంగ‌క్క‌ర‌(శ్రీలంక‌) ఈ జాబితాలో ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 598/4స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 ప‌రుగుల‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ 182/2 వ‌ద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి వెస్టిండీస్ ముందు 498 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

భారీ ల‌క్ష్యాన్ని చేధించేందుకు బ‌రిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్లు కోల్పోయి 192 ప‌రుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్ వైట్‌(101 నాటౌట్; 166 బంతుల్లో 11ఫోర్లు)తో పాటు కైల్ మేయ‌ర్స్‌(0) క్రీజులో ఉన్నారు. ఆఖ‌రి రోజు విండీస్ విజ‌యానికి 306 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఆస్ట్రేలియా గెల‌వాలంటే ఏడు వికెట్లు తీస్తే స‌రిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News