Lionel Messi : అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే అర్జెంటీనా తరుపున తనకు ఆఖరి మ్యాచ్ అని చెప్పాడు. ఈ ప్రపంచకప్ తరువాత మెస్సీ రిటైర్‌మెంట్ అవుతాడు అని వార్తలు వస్తున్న వేళ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
క్రియేషియాతో మంగళవారం అర్థరాత్రి దాటాకా జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ మెస్సీ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. మరో రెండు గోల్స్ అల్వరేజ్ చేశాడు. ఈ గోల్స్ అల్వరేజ్ చేయడంలో మెస్సీనే కీలక పాత్ర పోషించాడు. డిసెంబర్ 18న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు మొరాకో, ఫ్రాన్స్‌లలో గెలిచిన జట్టుతో తలపనుంది.
మ్యాచ్ అనంతరం మెస్సీ మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. తమ జట్టు ఫైనల్ చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఫైనల్స్ లో చివరి మ్యాచ్ అనంతరం తన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నా అంటూ చెప్పాడు. “ఇంకో ప్రపంచకప్ కు చాలా సంవత్సరాలు పడుతుంది. అయితే.. అప్పటి వరకు ఇలాగే ఆడతానని అనుకోవడం లేదు. నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించడానికి ఇంతకంటే మంచి అవకాశం వస్తుందని అనుకోవడం లేదు.” అని మెస్సీ అన్నాడు.
ఈ ప్రపంచకప్‌లో మెస్సీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచుల్లో ఐదు గోల్స్ చేశాడు. మరో మూడు గోల్స్‌కు సహకారం అందించాడు. 2014 ప్రపంచకప్‌లోనూ ఫైనల్ చేరిన అర్జెంటీనా చివరి మెట్టుపై బోల్తా పడింది. మరి ఈ సారి అయినా మెస్సీ తన కలను నిజం చేసుకుంటాడో లేదో చూడాలి.