బ్యూనస్ ఎయిర్స్ ( తెలుగు ప్రభ ) : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ జాతీయ జట్టులో తన కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 39 ఏళ్ల వయసులో దాదాపు రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానానికి ముగింపు పలికినట్లు సోమవారం వెల్లడించారు.
ఆరు ప్రపంచకప్‌లలో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ.. 2022లో ఖతార్ వేదికగా జట్టును విశ్వవిజేతగా నిలిపారు. 2026 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు తీసుకెళ్లినా స్పెయిన్ చేతిలో ఓటమి ఎదురైంది. ‘ఇది బాధ కలిగించిన నిర్ణయం.. ఇప్పటికీ ఆ బాధ తీవ్రంగానే ఉంది. కానీ సమయం వచ్చిందని అర్థమవుతోంది’ అని మెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. జాతీయ జెర్సీ కోసం ఎప్పుడూ శాయశక్తులా పోరాడానని, అభిమానులను ఆనందపరిచి అర్జెంటీనాను గర్వపడేలా చేసేందుకు శాయశక్తుల ప్రయత్నించినట్లు తెలిపారు.

