FIFA World Cup : ఏమా ఉత్కంఠ.. ఏమిటా పులకింత.. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవేమో. యావత్ క్రీడాలోకాన్ని మునివేళ్లపై నిలబెడుతూ ఆటగాళ్లు మైదానంలో విన్యాసాలు చేస్తుంటే సెలబ్రెటీలు సైతం చిన్న పిల్లలా గెంతులు వేస్తుండగా ఆఖరి క్షణం వరకు నువ్వా నేనా అనట్లు అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు తలపడ్డాయి. మెస్సీ మాయ చేయడంతో అర్జెంటీనా విజయం ఇక లాంఛనమే అన్న తరుణంలో ఎంబా పె ఊహించని రీతిలో అర్జెంటీనాకు షాకిస్తూ గోల్స్ చేయగా స్కోర్లు సమయం అయ్యాయి. అయితే.. పెనాల్టీ ఘాటౌట్‌లో అర్జెంటీనా విజయం సాధించి జగజ్జేతగా నిలిచింది.
మ్యాచ్ ఆరంభమైన తొలి 80 నిమిషాల్లో రెండు గోల్స్ చేసి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది అర్జెంటీనా. మరో 10 నిమిషాల ఆటే మిగిలి ఉండడంతో అర్జెంటీనా గెలుపు ఖాయం అని అందరూ సంబురాల్లో మునిగిపోయారు. అప్పుడొచ్చాడు ఎంబాపె. అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ యువ సంచలనం తనేంటో చూపించాడు. 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసి ఫ్రాన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని తీసుకువస్తూ అర్జెంటీనాకు గట్టి షాక్ ఇచ్చాడు.
దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండు గోల్స్ కొట్టడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఇంజ్యూరీ టైమ్ కూడా ముగిసింది. అయినా స్కోర్లు సమంగానే ఉన్నాయి. అప్పుడు ఎక్స్ ట్రా టైమ్‌లో మెస్సీ మరోసారి మాయ చేశాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యంలో వెల్లింది. మ్యాచ్ ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో ఆట చివరి క్షణాల్లో ఎంబాపె మరో గోల్ చేసి మ్యాచ్‌ను పెనాల్టీ ఘాటౌట్‌కు తీసుకువెళ్లాడు.
లక్ష మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో నరాలు తెగె ఉత్కంఠ మధ్య సాగిన ఘాటౌట్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో 36 ఏళ్ల తరువాత అర్జెంటీనా చాంఫియన్‌గా నిలిచింది. ఇన్నాళ్లు తనకు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్ మెస్సీ సొంతమైంది.
కెప్టెన్ లియోనెల్ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) కెరీర్ చివరి మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతో రెండు గోల్స్ కొడితే.. ఫ్రాన్స్ స్టార్ స్ట్రయికర్ కిలియన్ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగినప్పటికి జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.
ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ స్టార్ ఎంబాపే (8) నిలిచాడు. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ (7) రెండో స్థానంలో ఉన్నాడు.