రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఈ నెల 27 నుండి 29 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్పు రోడ్డు స్పీడ్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా సైకిలింగ్ రైడర్స్ 12 మంది బాలికలు, 12 మంది బాలురు జిల్లా కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో పాల్గొని, సబ్ జూనియర్ సైక్లింగ్ పోటీలలో మంచి ప్రదర్శన ఇచ్చి బాలికల విభాగంలో ఆర్డినరీ సైకిలింగ్10 కి.మీ రేసులో చందన ప్రథమ స్థానం, శ్రావణి ద్వితీయ స్థానం, మల్లీశ్వరి తృతీయ స్థానం, నందిని నాలుగో స్థానం పొందినట్లు, అలాగే బాలుర ఆర్డినరీ సైకిలింగ్ రేస్ విభాగంలో దర్శన్ రెండో స్థానం, పరశురాములు మూడో స్థానం, రోహిత్ నాలుగో స్థానం, వెంకటేష్ 5వ స్థానం పొందినట్లు బి.గోపాలం తెలిపారు.
లక్షల ఖరీదైన రేస్ సైకిళ్లతో మన సైక్లింగ్ రైడర్స్ పోటీ పడలేకపోయినా రాష్ట్ర నలుమూలల నుండి ఆర్డినరీ సైకిళ్లతో పాల్గొన్న వారి కంటే మన బాల బాలికలు మంచి ప్రదర్శన ఇచ్చి మెరుగైన స్థానాలలో నిలిచారనీ అన్నారు. నారాయణపేట జిల్లా సైక్లింగ్ పోటీలలో పాల్గొన్న బాలబాలికలందరూ ప్రశంసా పత్రాలు పొందినట్లు ఆయన తెలిపారు.
ఈ పోటీలలో పాల్గొన్న బాలబాలికలందర్నీ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. మల్లారెడ్డి, డి.ఎస్.పి. కుసల్కర్, కార్యదర్శి విజయ కాంతారావు, కోశాధికారి వెంకట్ నర్సయ్య, కోచ్ విజయభాస్కర్ రెడ్డి, సతీష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్, నారాయణపేట జిల్లా క్రీడల అధికారి వెంకటేష్ శెట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీలు విష్ణువర్ధన్, నరేష్, ఈశ్వర్, శ్రీలత పాల్గొన్నారు.