AUS vs SA : గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేసర్లు విజృంభించిన ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం గడిచిన 91 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తొలి రోజు ఆటలో 15 వికెట్లు పడగా, రెండో రోజు ఏకంగా 19 వికెట్లు నేలకూలాయి.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు అల్లాడిపోయారు. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్ప కూలారు. సఫారీ బ్యాటర్లలో వికెట్ కీపర్ కైల్ వెర్రెయిన్నే ఒక్కడే 64 పరుగులతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 218 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(92) ఎనిమిది పరుగుల తేడాతో శతాకాన్ని చేజార్చుకున్నాడు. ఆసీస్ కు 68 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా సఫారీ బ్యాటర్లు ఆదుకుంటారు అనుకుంటే ఈ సారి పూర్తిగా చేతులెత్తేశారు. 99 పరుగులకే ఆ జట్టు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ముందు 34 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటర్లను సపారీ స్టార్ పేసర్ రబాడా వణికించాడు. 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 8 ఓవర్లలోనే పూర్తి చేయడంతో రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. ఫలితంగా మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 26న ఆరంభం కానుంది.