MLC 2025 Winner: ముంబై ఇండియన్స్ మరోసారి అదగొట్టింది. టోర్నీ ఏదైనా సరే కప్ కొట్టడమే పనిగా పెట్టుకుంది. అద్భుతమైన ఆట తీరుతో దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఛాంపియన్స్ లీగ్, సౌతాఫ్రికా లీగ్ టోర్నీల్లో విజేతగా నిలిచింది. తాజాగా అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ క్రికెట్ లీగ్ 2025 ఎడిషన్ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సమిష్టిగా ఆడి మరో కప్‌ను ముద్దాడింది.
వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180/7 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లలో 77 పరుగులతో అదరగొట్టాడు. ఇక మోనాక్ పటేల్ 28 పరుగులు, కున్వార్‌జీత్ సింగ్ 22 పరుగులతో తమ వంతు పాత్ర పోషించారు. ఇక వాషింగ్టన్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు, మ్యాక్స్‌వెల్, జాక్ ఎడ్వర్డ్స్, హోలాండ్, నేత్రావల్కర్ తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వాషింగ్టన్ జట్టుకు ఆరంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లోనే ఓపెనర్ మిచెల్ ఓవన్, తర్వాత వచ్చిన ఆండ్రీస్ గౌడ్ డకౌట్‌గా ఔట్ అయ్యారు. కానీ రచిన్ రవీంద్ర మాత్రం ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రవీంద్రకు ఎడ్వర్డ్స్ కూడా తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో రచిన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 41 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. అయితే ఎడ్వర్డ్స్ 33 పరుగుల వద్ద ఔటయ్యాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం అందించారు.
Also Read: కశ్యప్‌తో సైనా నెహ్వాల్ విడాకులు
ఎడ్వర్డ్స్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. రచిన్‌తో కలిసి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే రవీంద్ర ఔట్ కావడం ఎంఐకి కలిసొచ్చింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడలేకపోయాడు. 16 బంతులు ఆడి కేవలం 15 పరుగుల మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో చివరి ఓవర్‌లో 12 పరుగుల చేయాల్సి ఉండగా.. మ్యాక్స్‌వెల్ విఫలం కావడంతో వాషింగ్టన్ పరాజయం పాలైంది. 20 ఓవర్లలో 175/5 పరుగులు మాత్రమే చేసింది. ఎంఐ బౌలర్లలో బౌల్ట్, ఉగార్కర్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ రెండోసారి మేజర్స్ లీగ్ క్రికెట్ ట్రోఫీని అందుకుంది.
CHAMPIONS 🏆 pic.twitter.com/pWkAxkAJwr
— Cognizant Major League Cricket (@MLCricket) July 14, 2025


