భారత క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammed Shami)పై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ(Shahabuddin Rizvi) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులతో పాటు షమీ కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. షమీ దేశం కోసం ఆడుతున్నారని.. ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లలేదని కౌంటర్ ఇస్తున్నారు. టీమిండియా ఓటమిని కోరుకునే వారే ఇలా మాట్లాడతారని మండిపడుతున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు ఉపవాసం లేకుండానే క్రికెట్ ఆడతారని.. వారిని విమర్శించే ధైర్యం లేదని ఫైర్ అవుతున్నారు. దేశాన్ని గెలిపించడానికి షమీ ఏదైనా చేస్తాడని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకోకుండా ఫైనల్ మీద దృష్టిపెట్టాలని షమీకి సూచించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఎనర్జీ డ్రింక్ తాగారు. దీంతో ముస్లిం అయిన షమీ రంజాన్ మాసంలో ఉపవాసం చేయకుండా పెద్ద పాపం చేస్తున్నాడని అతడిని అల్లా శిక్షిస్తాడని జమాత్ సంస్థ చీఫ్ రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను పెద్ద క్రిమినల్ అని ఘాటు విమర్శలు చేశారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం యువతి, యువకుడు తప్పనిసరగా ఉపవాసం చేయాలని షరియత్‌లో ఉందని చెప్పారు. ఉపవాసం చేయని వారిని అల్లా క్షమించడని హెచ్చరించారు. దీంతో రిజ్వీ వ్యాఖ్యలపై దేశమంతా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.