Mohammed Siraj : భారత పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2022లో భారత్ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో టీమ్ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో అనముల్ హల్‌ను పెవిలియన్‌కు చేర్చిన తరువాత సిరాజ్ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంవత్సరం వన్డేల్లో సిరాజ్ ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు సాధించాడు. అతడి తరువాతి స్థానాల్లో యుజ్వేంద్ర చహల్ (14 మ్యాచుల్లో 21 వికెట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (11 మ్యాచుల్లో 19 వికెట్లు), శార్దూల్ ఠాకూర్ (15 మ్యాచుల్లో 19వికెట్లు) లు ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాను మెహిదీ హాసన్(100 నాటౌట్; 83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), మహముదుల్లా(77; 96 బంతుల్లో 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. కాగా.. భారత్‌పై బంగ్లాకు ఏ వికెట్‌పైనా అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.