MI vs LSG IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో MI అద్భుత విజయాన్ని సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్, రికెల్టన్ విధ్యంసకర బ్యాటింగ్‌తో సొంతగడ్డపై 6 వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసింది.
వాంఖడే స్టేడియం వేదికగా తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్‌జెయింట్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే లక్నో దూకుడు ప్రదర్శిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ (13) నిరాశపరిచినా మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ 44(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో రాణించాడు. ఇక, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సిక్సర్ల విధ్వంసం సృష్టించాడు. మొదటి బంతి నుంచే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. కేవలం 21 బంతుల్లోనే 63(ఒక ఫోర్, 8 భారీ సిక్సర్ల) పరుగులు చేశాడు.
అయితే నికోలస్ ఔట్ అయిన తర్వాత లక్నో జోరుకి కళ్లెం పడింది. కెప్టెన్ రిషభ్ పంత్ (15), అక్షత్ రఘువంశీ (11) విఫలమయ్యారు. ఐడెన్ మార్క్‌రమ్ (25 బంతుల్లో 31 నాటౌట్), హిమ్మత్ సింగ్ (31 బంతుల్లో 40 నాటౌట్) అద్భుత ప్రదర్శనతో రాణించి స్కోరు బోర్డును 200 దాటించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు పడగొట్టి కాస్త ఫర్వాలేదనిపించాడు. రఘుశర్మ, ఘజన్‌ఫర్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.
229 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన ముంబై ఇండియన్స్.. ఆది నుంచే జోరు ప్రదర్శించింది. స్టార్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ సిక్సర్ల సునామీ సృష్టించారు. రికెల్టన్ కేవలం 36 బంతుల్లో 83 పరుగులు(6 ఫోర్లు 8 సిక్సర్లు), రోహిత్ శర్మ 84(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులతో చెలరేగి ఆడారు. వీరి అద్భుత పర్ఫామెన్స్‌తో స్కోరు దాదాపు 170 దాటడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. అయితే రికెల్టన్, తర్వాత రోహిత్ ఔటయ్యాక.. తిలక్ వర్మ(11) పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. సూర్య కుమార్ యాదవ్(12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫీల్డర్‌కి చిక్కాడు. దీంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. కానీ, ఎట్టకేలకు నమన్ ధీర్ (23 నాటౌట్), జాక్స్(10 నాటౌట్) భారీ సిక్సర్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నో బౌలర్లలో సిద్దార్థ్ 2 వికెట్లు, మహ్మద్ షమీ, మోహ్సిన్ ఖాన్‌కి చెరో వికెట్ దక్కింది.

