ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ముగింపు దశకు వచ్చింది. మార్చి 9న భారత్- న్యూజిలాంట్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది. మరోవైపు ట్రోఫీ నుంచి ఇంటిబాట పట్టిన ఇతర జట్ల స్టార్ క్రికెటర్లు వరుసగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్ కీలక ఆటగాడు ముష్ఫికర్ రహీం(Mushfiqur Rahim) వన్డేలకు వీడ్కోలు పలికాడు. కెరీర్ మొత్తం ఎంతో నిజాయితీతో, అంకితభావంతో పనిచేశానని తెలిపాడు. అయితే గత వారం రోజుల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ముష్ఫికర్ విఫలమయ్యాడు.
2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ముష్ఫికర్ రహీం అరంగేట్రం చేశాడు. 274 మ్యాచుల్లో 7,795 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే కీపర్‌గా 243 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు 56 స్టంప్ ఔట్స్ చేశాడు. కొన్నేళ్ల పాటు జట్టు కెప్టెన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.