South Africa vs Namibia T20: విండ్హోక్‌లో శనివారం జరిగిన క్రికెట్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నమీబియా జట్టు అద్భుత విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించడంతో పాటు నమీబియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కాగా, టీ20 ప్రపంచకప్ 2026కు ఇటీవల అర్హత సాధించిన ఈ జట్టు.. దక్షిణాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు నెలకొల్పింది.
తొలుతగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్దిష్ట 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి గాను 134 పరుగులు చేసింది. దీంతో 135 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 66 పరుగులే చేసి కష్టాల్లో పడింది. మ్యాచ్ ఓడిపోతుందనుకున్న సమయంలో వికెట్ కీపర్ జేన్ గ్రీన్, బౌలింగ్ ఆల్‌రౌండర్ రూబెన్ ట్రంపెల్‌మన్ జట్టు గెలుపు బావుటా ఎగురవేయడంలో కృషి చేశారు.
గెలుపు కోసం లాస్ట్ ఓవర్‌లో నమీబియా 11 పరుగులు చేయాల్సి ఉండగా.. గ్రీన్ తనదైన బ్యాటింగ్‌తో మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికి సిక్స్, చివరి బంతికి బౌండరీ కొట్టి జట్టుకు గెలుపునందించాడు. కాగా, గ్రీన్ 23 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక బౌలింగ్ సమయంలోనూ నమీబియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి 8 వికెట్లు పడగొట్టి సౌత్‌ఆఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో విక్టరీతో నమీబియా ఇప్పటివరకు నాలుగు ఫుల్ మెంబర్ దేశాలను టీ20ల్లో ఓడించడం విశేషం. ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంకలతో పాటు తాజాగా దక్షిణాఫ్రికాను ఓడించి చారిత్రక రికార్డు నెలకొల్పింది. కాగా, దక్షిణాఫ్రికా మొదటిసారిగా అసోసియేట్ జట్టుతో ఓడిపోయింది.


