Wednesday, September 11, 2024
HomeఆటNational sports day: యువత జీవనశైలిలో క్రీడలు భాగం కావాలి

National sports day: యువత జీవనశైలిలో క్రీడలు భాగం కావాలి

“జాతీయ క్రీడా దినం” సందర్భంగా..

మన దేశ క్రీడా జెండాను విశ్వ ఓలంపిక్‌ క్రీడా వేదికగా మూడు సార్లు (1928, 1932, 1936) జయకేతనం ఎగురవేసిన బుందేల్‌ఖండ్‌ ఆణిముత్యం అత్యుత్తమ హాకీ క్రీడాకారుడు పద్మభూషనుడు మేజర్ ధ్యాన్‌చంద్‍ పుట్టిన రోజు 29 ఆగష్టు 1905ను భరతావని నలుమూలల “జాతీయ క్రీడా దినం”గా ప్రతియేట పాటించుట ఆనవాయితీగా మారింది. భారత వీర సైనికుడు ధ్యాన్‌చంద్‍ క్రీడా జీవితంలో (1926-48 మధ్య కాలంలో) 1000కి పైగా సార్లు హాకీ బంతితో గోల్స్‌ను ముద్దాడిన ఘనుడిగా ప్రతి ఒక్క భారతీయుడి మదిలో తిష్ట వేశారు. కోట్లాది భారత యువతను క్రీడల వైపుకు ఆకర్షించాలనే లక్ష్యంతో 1991-92లో నెలకొల్పిన దేశ అత్యుత్తమ క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న’ అవార్డును 2021 నుంచి ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‍ ఖేల్‌ రత్న’గా పునర్‌ నామకరణం చేయడం కూడా ముదావహం. క్రీడాకారులకు ఇవ్వనున్న అవార్డులను ప్రముఖ క్రీడాకారుల పేరున ఇవ్వడం సముచితంగా తోస్తున్నది. 2016 నుంచి దేశ అత్యుత్తమ క్రీడాకారుడికి ప్రదానం చేసే పురస్కారం కూడా “ధ్యాన్‌చంద్‍ జీవన సాఫల్య ఆవార్డు”గా అందించడం మనకు తెలుసు.

- Advertisement -

క్రీడల ప్రయోజనాలు :
క్రీడలతో వ్యక్తిగతంగా శారీరక, మానసిక ఆరోగ్యం, యువతలో జీవన నైపుణ్యాలు, జీవన ఎత్తుపల్లాల నియంత్రణ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్‌ స్పిరిట్‌, శారీరక చురుకుదనం, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసాలను పెంచుటలో ఆటలు దోహదపడతాయి. గెలుపోటములను సమానంగా స్వీకరించడం క్రీడా స్పూర్తి నేర్పుతుంది. క్రీడలతో ఎముకల పటిష్టత, గుండె సంబంధ ఆరోగ్యం, స్థూలకాయాన్ని దూరం చేయడం, ప్రశాంత నిద్ర, శారీరక అవయవాల సమన్వయం, సమాజంలో గుర్తింపుతో పాటు ఆదర్శంగా నిలవడం, ఊపిరితిత్తుల ఆరోగ్యం, బిపి/షుగర్‌ నియంత్రణ, నిర్ణయం తీసుకునే నైపుణ్యం, రోగనిరోధక శక్తి పెరుగుదల, ఉద్యోగ సాధన లాంటి ముఖ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దేశ క్రీడా కాగడాను విశ్వవ్యాప్తం చేసిన “ఖేల్‌ రత్నా”లు:
భారతదేశ అత్యుత్తమ చదరంగ ఆటగాడు, బాల మేధావి గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‍కు తొలి “ఖేల్‌ రత్న” పురస్కారాన్ని 1991-92లో ప్రదానం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ అత్యుత్తమ పురస్కారాన్ని పొందిన క్రీడా దిగ్గజాల జాబితాలో పంకజ్‌ అదానీ (బిలియర్డ్స్‌ అండ్ స్నూకర్‌), రోహిత్‌ శర్మ (క్రికెట్‌), మరియప్ప (పారా అత్లెటిక్స్‌), ఆర్‌ బి రమేశ్‌(చెస్‌ కోచ్‌), సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి(బ్యాడ్మింటన్‌) మనిక బాత్రా (టేబుల్‌ టెన్నిస్‌), వినేష్‌ పోగట్‌ (రెడ్లింగ్‌), గీతా సేతి (బిలియర్డ్స్‌), కరణం మల్లేశ్వరీ (వేయిట్‌ లిఫ్టింగ్‌), లియాండర్‌ పేస్‌ (టెన్నీస్‌), సచిన్‌ టెండూల్కర్‌ (క్రికెట్‌), ధన్‌రాజ్‌ పిల్లై (హాకీ), పుల్లెల గోపీచంద్‍ (బ్యాడ్‌మింటన్‌), అభినవ్‌ బింద్రా (షూటింగ్‌), అంజు బాబీ జార్జ్‌ (అత్లెటిక్స్‌), రాజవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ (షూటింగ్‌), మహేంద్ర సింగ్‌ ధోనీ (క్రికెట్‌), మేరీ కోమ్‌ (బాక్సింగ్‌), విజెందర్‌ సింగ్‌ (బాక్సింగ్‌), సుశిల్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), సైనా నెహవాల్‌ (బ్యాడ్మింటన్‌), గగన్‌ నరంగ్‌ (షూటింగ్‌), సానియా మిర్జా (టెన్నీస్‌), పి వి సింధూ (షటిల్‌), సాక్షి మాలిక్‌ (రెజ్లింగ్‌), విరాట్‌ కొహ్లీ (క్రికెట్‌), రాణి రాంపాల్ (హాకీ), బజరంగ్‌ పునియా‌ (రెజ్లింగ్‌), దీపా మలిక్‌ (పారాలంపిక్స్‌), మీరాభాయ్‌ చానూ (వేయిట్‌ లిఫ్టింగ్‌), సర్దార్‌ సింగ్‌ (హాకీ), దేవెంద్ర జజరియా (పారాలింపిక్స్‌), జీతూ రాయ్‌ (షూటింగ్‌), దీపా కర్మాకర్‌ (జిమ్నాస్టిక్స్‌), రోజన్‌ సౌథీ (షూటింగ్‌), యోగేశ్వర్‌ దత్‌ (రెజ్లింగ్‌), విజయ్‌ కుమార్‌ (షూటర్‌), యం యస్‌ సంధూ (షూటింగ్), అంజలి భగత్‌ (షూటింగ్), బినామొల్‌ (అత్లెటిక్స్‌), జ్యోతిర్మయీ (అథ్లెటిక్స్‌), కుంజారాణి (వేయిట్‌ లిఫ్టింగ్‌), పుష్పెంద్ర కుమార్‌ (యాచింగ్‌), హోమి మోతివాలా (యాచింగ్‌), రవి కుమార్‌ (రెజ్లింగ్‌), మిథాలిరాజ్‌ (క్రికెట్‌), లవ్‌లీనా (బాక్సింగ్‌), శ్రీజేష్‌ (హాకీ) లాంటి పలు క్రీడాకారులకు చోటు దక్కించుకోవడం హర్షదాయకం. ఈ పురస్కారంలో భాగంగా పతకం, సర్టిఫికెట్‌, 25 లక్షల నగదు అందించి సన్మానిస్తారు. ఖేల్‌ రత్నకు తోడుగా అర్జున ఆవార్డు, ద్రోణాచార్య ఆవార్డులు కూడా ప్రదానం చేయడం మనకు విదితమే.

ర్యాంకుల వేటలో యువత క్రీడల పట్ల నిర్లక్ష్యం:
ఆధునిక బాలలు/తల్లితండ్రులు ర్యాంకుల, మార్కుల వేటలో కొట్టుకుపోతున్నారు. నేటి స్మార్ట్‌ చదువులకు తోడుగా క్రీడలు కూడా తోడైతేనే పిల్లల సమగ్రాభివృద్ధి సుసాధ్యం అవుతుందని తల్లితండ్రులు, విద్యార్థులు తెలుసుకోవాలి. మన విద్యలో క్రీడలు ప్రధాన భాగం కావాలి. ఆటలు పిల్లల ముఖాల్లో సంతోష పువ్వులు పూయించాలి. క్రీడా ప్రాంగణం చెమటతో తడిసి ముద్ద కావాలి. యువతలో నిస్సత్తువ తరిమి వేవాలి. క్రీడాకారుడిగా పతకాల పంట పండించాలి. జాతీయ పతాక రెపరెపలను విశ్వవ్యాప్తం చేయాలి. నిర్వీర్య యువతలో క్రియాశీలతను జోడించుటకు ఆటపాటలు ఉపకరణాలుగా మారాలి. ఆటలు కూడా ఉద్యోగాలను పొందడానికి మార్గమని తెలుసుకోవాలి.
నేటి యువభారతం క్రీడా నైపుణ్య జ్ఞానంతో ధ్యాన్‌చంద్‍ వారసుడిగా దేశ క్రీడా ప్రతిష్టను ఇనుమడింపజేయాలి. క్రీడలు కీర్తి తోరణాలు, ఆటలు అమూల్య ఆరోగ్య ప్రదాతలని రుజువు చేయాలి.

            డా: బుర్ర మధుసూదన్ రెడ్డి 
                    9949700037
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News