దేశవ్యాప్తంగా జరిగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు రిక్రూట్మెంట్లలో రాష్ట్రం నుండి చేరే వారి సంఖ్య పెరగాలంటే ఎన్సిసి (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) సేవలను రాష్ట్రంలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బిర్పాల్ సింగ్ (Gurbirpal Singh) (AVSM.VSM) అన్నరు. వెలగపూడి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్ జవహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా గుర్బిపాల్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్సీసీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించిన వివిధ అంశాలపై డైరెక్టర్ జనరల్ సిఎస్ తో చర్చించారు. రాష్ట్రంలో ఎన్సీసీ సేవలు తక్కువగా ఉన్నాయని, వీటిని పూర్తి స్థాయిలో కళశాలలు, పాఠశాలల్లో పెద్దఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందని సిఎస్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న ఎన్సీసీ సేవలను 60 శాతం పైగా విస్తరించ గలిగితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు రిక్రూట్మెంట్లలో అధిక సంఖ్యలో అభ్యర్ధులు ఏపీ నుండి పాల్గొనేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
ఏపీ, తెలంగాణాకు కలిపి ఒకే ఎన్సీసీ డైరక్టరేట్ ఉందని ఏపీ ప్రత్యేకంగా ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయదలిచినట్టు అందుకు తగిన స్థలం, ఇతర సహాయ సహకారాలందించాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరారు. ఇందుకు సిఎస్ సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. రాష్ట్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రాలు, జిల్లా పోలీస్ పెరేడ్ మైదానాలను ఖాళీగా ఉన్న సమయంలో ఎన్సీసీ సేవలకు ఉపయోగించేలా చూడాలని కోరగా సిఎస్ జవహర్ రెడ్డి స్పందించి దానిపై పోలీస్ శాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆంధ్రప్రదేశ్- తెలంగాణా ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్ (వియం), కల్నల్ లు వివి శ్రీనివాస్, వివేక్ షీల్ పాల్గొన్నారు.