Neeraj Chopra launches Vel Sports : భారత అథ్లెటిక్స్ స్వర్ణయుగ సారథి, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కెరీర్ ఆరంభం నుంచి అండగా నిలిచిన ప్రతిష్ఠాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్’ సంస్థతో తన దశాబ్దకాల అనుబంధానికి వీడ్కోలు పలికారు. క్రీడాకారుడిగానే కాకుండా, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ, ‘వెల్ స్పోర్ట్స్’ పేరుతో తన సొంత అథ్లెట్ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించారు.
ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన జావెలిన్ హీరో నీరజ్ చోప్రా, 2016 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఈ సంస్థ, ఆయన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో, అంతర్జాతీయ వేదికలపై రాణించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, ఈ దశాబ్దకాల భాగస్వామ్యానికి ఇరు పక్షాలు పరస్పర గౌరవంతో ముగింపు పలుకుతున్నట్లు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.
“గత దశాబ్ద కాలంగా, మా ప్రయాణం ఎదుగుదల, నమ్మకం, విజయాలతో సాగింది. నా కెరీర్‌లో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ పాత్ర చాలా కీలకమైనది. వారి మద్దతుకు, దార్శనికతకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఈ అధ్యాయం ముగిసినా, అవే విలువలతో నా తదుపరి ప్రయాణాన్ని కొనసాగిస్తాను.”
– నీరజ్ చోప్రా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత
జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ ఏమంటోంది : నీరజ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. “నీరజ్‌తో పనిచేయడం మాకు ఓ అద్భుతమైన అనుభవం. ఆయన విజయగాథ, మా ఇద్దరి ఉమ్మడి శ్రేష్ఠతా తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మేం కలిసి సాధించిన విజయాలకు గర్విస్తున్నాం. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాం,” అని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సీఈఓ దివ్యాంశు సింగ్ తెలిపారు.
నీరజ్ ప్రస్థానం.. ఓ స్వర్ణయుగం : 27 ఏళ్ల నీరజ్ చోప్రా, భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.
టోక్యో ఒలింపిక్స్ (2021): ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్ (2023): స్వర్ణ పతకాన్ని ముద్దాడారు.
పారిస్ ఒలింపిక్స్ (2024): రజత పతకాన్ని గెలుచుకున్నారు. వీటితో పాటు, డైమండ్ లీగ్ వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి, దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. ఇప్పుడు, తన అనుభవాన్ని, దార్శనికతను ఉపయోగించి, ‘వెల్ స్పోర్ట్స్’ ద్వారా భావి క్రీడాకారులను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను స్వీకరించారు.

