టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంభీర్ రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియాకు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక అతని ఆధ్వర్యంలోనే టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కూడా దక్కింది. ఈ విషయం పక్కన పెడితే హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు ప్రారంభించిన తొలినాళ్లలో ఏదీ కలిసి రాలేదు. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో గంభీర్ ను హెడ్ కోచ్ గా తప్పిస్తారన్న వార్తలు సైతం వచ్చాయి.
అలాంటి సమయంలో టీమిండియా 12 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సక్సెస్ కావడంతో ఇప్పుడు గంభీర్ రెడ్ బాల్ క్రికెట్ పై దృష్టి పెట్టాడు. టెస్టుల్లో స్వదేశంలో కివీస్ చేతిలో ఓటమి, ఆస్ట్రేలియా గడ్డ పై బోర్డర్ గ్రావాస్కర్ ట్రోఫీని నిలుపుకోవడంలో విఫలం కావడంతో గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC 2025-27) మొదలు కానుంది. అయితే సీనియర్ జట్టు కంటే ముందే భారత ఏ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత ఏ జట్టుతో పాటు గంభీర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన తర్వాత నుంచి ఇదే విషయం పై బీసీసీఐతో గంభీర్ చర్చలు జరుపుతున్నాడట. భారత ఏ జట్టుతో ప్రయాణిస్తే టీమ్ఇండియా రిజర్వ్ బెంచ్ ను మరింత బలంగా మార్చుకోవచ్చునని అతను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో భారత జట్టులో పలు మార్పులకు అవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లను పక్కన బెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో పట్టుబట్టి నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణాలను ఆసీస్ పర్యటనకు తీసుకువెళ్లాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి ఈ సిరీస్ లో అద్భుతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌లను గెలవలేదు. భారత జట్టు చివరి సారిగా 2021లో ఇంగ్లాండ్‌లో పర్యటించింది. అప్పుడు కోహ్లీ సారథ్యంలో ఆడగా 2-2తో సిరీస్ సమం అయింది. ఓ దశలో భారత్ 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచినప్పటికీ అప్పుడు కోవిడ్ వల్ల చివరి టెస్టును రద్దు చేశారు. ఆ తర్వాత ఆ టెస్టు మ్యాచ్‌ను 2022 జూలైలో షెడ్యూల్ చేయగా.. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో సిరీస్ డ్రా గా ముగిసింది. దీంతో ఈ సారి ఎలాగైనా సిరీస్ కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.