Friday, November 22, 2024
HomeఆటIND vs NZ: రెండో టెస్టులో ఘోరంగా ఓడిపోయిన భారత్.. సిరీస్ కివీస్ కైవసం

IND vs NZ: రెండో టెస్టులో ఘోరంగా ఓడిపోయిన భారత్.. సిరీస్ కివీస్ కైవసం

IND vs NZ|పుణే వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌(New Zealand) ఘన విజయం సాధించింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో 113 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్‌ను కూడా కోల్పోయింది. వరుసగా రెండో టెస్టులోనూ విజయం సాధించిన ఆతిథ్య జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన భారత్.. ఇప్పుడు సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం.

- Advertisement -

భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) మాత్రమే కివీస్ బౌలర్లకు ధీటుగా ఎదుర్కొన్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (17) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ ఫెయిల్ అయ్యారు. ఇక శుభమన్ గిల్ 23, సర్ఫరాజ్ ఖాన్ 9, వాషింగ్టన్ సుందర్ 21, రవిచంద్రన్ అశ్విన్ 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 6 వికెట్లతో చెలరేగాడు. అజాజ్ పటేల్ 2, గ్లేన్ ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 259 పరుగులతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవన్ కాన్వే (76) పరుగులు, తొలి టెస్టు సెంచరీ హీరో రచిన్ రవీంద్ర(65) పరుగులతో రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓ దశలో 197/4 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ జట్టును స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ముప్పతిప్పలు పెట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ఏడు వికెట్లు తీశాడు. ఇక మరో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. వరుసగా వికెట్లు తీస్తూ హడలెత్తించారు. ఈ దెబ్బకు భారత్ కేవలం 156 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 103 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ సాంట్నర్ ఒక్కడే 7 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 359 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. కెప్టెన్ టామ్ లాథమ్(86), గ్లెన్ ఫిలిప్స్‌ (48*), టామ్ బ్లండెల్ (41) రాణించారు. కివీస్ టీమ్ 10 వికెట్లను స్పిన్నర్లే తీయడం విశేషం. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. ఇక మూడో టెస్టు ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News