Sunday, December 8, 2024
HomeఆటIND vs NZ: భారత్ ఘోర పరాజయం.. కివీస్ ఘన విజయం..

IND vs NZ: భారత్ ఘోర పరాజయం.. కివీస్ ఘన విజయం..

IND vs NZ| అద్భుతాలేమీ జరగలేదు. సంచలనమేమీ నమోదుకాలేదు. అనుకున్నదే జరిగింది. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. కేవలం 107 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలో దిగిన కివీస్ జట్టు అలవోక గెలుపొందింది. తొలుత వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించినా.. తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆదిలోనే కివీస్ ఓపెనర్లు టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (17)ను బుమ్రా ఔట్ చేసి భారత అభిమానుల్లో ఆశలు నింపాడు. అయితే విల్ యంగ్ (48), రచిన్ రవీంద్ర (39) మరో వికెట్ పడకుండా మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచక్ టీమిండియా నుంచి చేజారిపోయింది. ఇక భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 1988 తర్వాత భారత్‌లో న్యూజిలాండ్ జట్టు టెస్టుల్లో విజయం సాధించడం విశేషం.

- Advertisement -

కాగా మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి టెస్టు మొదలైంది. తొలి రోజు ఆట వర్షం కారణం రద్దు కాగా..రెండో రోజు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఐదుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. దీంతో రోహిత్ సేన కేవలం 46 పరుగులకే చాప చుట్టేసింది. అనంతం బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. ఆది నుంచే భారత బౌలర్లపై పెత్తనం చెలాయించారు. డ్వేన్ కాన్వే, సౌతీ హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా.. భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో కివీస్ జట్టు 402 పరుగులకు ఆలౌట్ కాగా.. 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

అయితే తీవ్ర ఒత్తిడితో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత ఆటగాళ్లు అదరగొట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అర్థసెంచరీలతో రాణించగా.. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులతో కదంతొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ జట్టు ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచింది. ఇదిలా ఉంటే రెండో టెస్టు ఈనెల 24న పుణే వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News