ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ అవమానకర రీతిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్‌లో జింబాబ్వే, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి కనీసం సూపర్ 12 దశకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. దీంతో ఇంటా, బయటా వెస్టిండీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పొట్టి ప్రపంచకప్‌లో విండీస్ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ నికోలస్ పూరన్ ఆ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో పూరన్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది విండీస్ బోర్డు. అయితే.. సంవత్సరం కూడా కాకముందే పూరన్ కెప్టెన్సీ ని వదులుకోవడం గమనార్హం. జట్టును విజయవంతంగా నడిపించకపోవడంతో పాటు వ్యక్తిగతంగానూ పూరన్ విఫలం అయ్యాడు. ఇది చాలా కఠినమైన నిర్ణయమని, అయినప్పటికి జట్టు మంచి కోసం ఇదే సరైందని అన్నాడు.
“టీ20 ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శన నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అప్పటి నుంచి కెప్టెన్సీ గురించి ఆలోచిస్తున్నాను. నేను సారథ్య బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అంకితబావంతో నా పాత్రను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేశాను. అయితే.. ప్రపంచకప్‌లో మాత్రం అన్ని విభాగాల్లో విఫలం అయ్యాం. విండీస్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడడానికి చాలా సమయం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు మేము పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతాం” అని పూరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో తెలిపాడు.
15 వన్డేలు, 15 టీ20ల్లో వెస్టిండీస్ జట్టుకు పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.