వచ్చే నెల నుంచి ఐపీఎల్(IPL 2025) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టోర్నీ షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు విజయవంతమైన జట్టుగా పేరు దక్కించుకుంది. ఇప్పటివరకు ఐదు సార్లు ట్రోఫీ గెలిచి శభాష్ అనిపించింది. అందుకు ఆ జట్టులోని స్టార్ ప్లేయర్లే కారణం. ముంబైకు ఆడారంటే టీమిండియాకు ఆడినట్లే అనే అభిప్రాయం ఉంది. ఎందుకుంటే ఇప్పటివరకు పాండ్యా బ్రదర్స్, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లు భారత జట్టులో స్టార్ ఆటగాళ్లగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా, బుమ్రా లాంటి ఆటగాళ్ల ప్రతిభను ఎలా గుర్తించామనే విషయాన్ని ముంబై ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీ (Nita Ambani) వెల్లడించారు.
టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించేందుకు తమ బృందంతో ప్రతి రంజీ మ్యాచ్‌కు వెళ్లేవారన్నారు. ఓ రోజు తన బృందం ఇద్దరు కుర్రాళ్లను ఎంపిక చేసి క్యాంప్‌నకు తీసుకొచ్చారని.. అప్పటికి వారిద్దరూ చాలా బక్కపలచగా ఉన్నారని తెలిపారు. గత మూడేళ్ల నుంచి సరైన డబ్బుల్లేక కేవలం మ్యాగీ, నూడుల్స్ మాత్రమే తినేవాళ్లమని వారు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ వారిలో ఆటపట్ల నిబద్ధత, ఉత్సాహం, అభిరుచిని గమనించానని తెలిపారు. ఆ ఇద్దరే హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య సోదరులు అన్నారు. 2015లో పాండ్యను తొలిసారి 10వేల యూఎస్ డాలర్లకు వేలంలో తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తమ టీమ్ కెప్టెన్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఇక ఆ తర్వాత మరో ఆటగాడిని క్యాంప్‌లో చేర్చారని.. అతడి బౌలింగ్‌ను చూసి తీసుకొచ్చామని చెప్పారన్నారు. అతడు బంతితోనే మాట్లాడతాడని గమనించామన్నారు. అతను ఎవరో కాదని జస్‌ప్రీత్ బుమ్రా అని తెతిపారు. అలాగే తిలక్ వర్మను పరిచయం చేయగా.. భారత జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడని ఆమె వివరించార. అందుకే ముంబై ఇండియన్స్ భారత క్రికెట్ జట్టుకు నర్సరీ లాంటిదని.. అద్భుతమైన ఆటగాళ్లను అందిస్తూ ఉంటుందని వెల్లడించారు.