ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఫోర్లు, సిక్సర్‌తో 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. నితీష్ సెంచరీ చేయగానే స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తున్న అతడి తండ్రి ఎమోషనల్ అయి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు నితీశ్ కుమార్‌కు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అద్భుతమైన సెంచరీ అంటూ కొనియాడుతున్నారు. ఇక ఈ సెంచరీతో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు నితీష్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తర్వాత సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా రికార్డు సాధించాడు. అలాగే ఆస్ట్రేలియాలో భారత్ తరపున సెంచరీలు చేసిన అత్యంత పిన్న వయస్కులలో నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.