బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్ల ధాటికి సీనియర్ ఆటగాళ్లు విఫలమైనా మనోడు మాత్రం అడ్డుగా నిలబడి ఆడిన తీరుపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కూడా నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.
కుమారుడు సెంచరీతో తీవ్ర భావోద్వేగానికి గురైన నితీశ్ తండ్రి కామెంట్రీ బాక్స్‌లోని సునీల్ గవాస్కర్ కాళ్లకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.వెంటనే సన్నీ ఆయనను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా కలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు.