French Open: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో సంచలనం నమోదైంది. అమెరికా తరఫున వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ప్రవాసాంధ్రుడు ఏడో సీడ్ ఆటగాడికి షాకిచ్చాడు. 21 ఏళ్ల నిషేష్ బసవరెడ్డి తొలి రౌండ్‌లోనే అద్భుత విజయాన్ని అందుకున్నాడు. టోర్నీలో బలమైన ప్రత్యర్థిగా భావించిన ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
హోరాహోరీ పోరులో అద్భుత విజయం: ప్రారంభం నుంచే ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నిషేష్ బసవరెడ్డి అద్భుత ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై 7-6 (5), 7-6 (5), 6-7 (9), 6-1 తేడాతో నిషేష్ సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మొదటి రెండు సెట్లను టై బ్రేకర్లలో గెలుచుకున్న నిషేష్.. మూడో సెట్‌ను కోల్పోయాడు. అయినప్పటికీ నాలుగో సెట్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
Also read-Sachin: ఆటతో ఆకట్టుకున అర్జున్ టెండూల్కర్.. గాడ్ ఆఫ్ క్రికెట్ ఎమోషనల్ పోస్ట్!
నెల్లూరు టూ అమెరికా: సంచలన విజయంతో అంతర్జాతీయ టెన్నిస్ వర్గాల దృష్టిని ఆకర్షించిన నిషేష్ బసవరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌తో బలమైన ముడి ఉంది. నిషేష్ కుటుంబం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందింది. వీరి కుటుంబం 1999లో ఉపాధి నిమిత్తం అమెరికాకు వలస వెళ్లింది. అనంతరం 2005లో నిషేష్ అమెరికాలోనే జన్మించాడు. చిన్నతనం నుంచే టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకున్న అతను.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తెలుగువారి పేరును మార్మోగించాడు. మొదటి రౌండ్‌లోనే టాప్ సీడ్ ఆటగాడికి షాకిచ్చిన నిషేష్.. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టోర్నీలో మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

