ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం వహించిన పాకిస్థాన్(Pakistan) టీమ్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది. దీంతో సీనియర్ ఆటగాళ్లను తప్పించి యువ ఆటగాళ్లతో న్యూజిలాండ్‌లో టీ20ల సిరీస్‌కు జట్టును పాక్ బోర్డు సెలెక్ట్ చేసింది. అయినా కానీ ఆ జట్టు తీరు మారలేదు. ఐదు మ్యాచ్‌ల(NZvs PAK) టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ జరిగిన రెండో టీ20లోనూ ఆతిథ్య కివీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. తొలి టీ20లోనూ పాక్ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
రెండో టీ20 మ్యాచ్‌ను వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సదాబ్ ఖాన్ 26, షాహీన్ షా అఫ్రిది 22 రన్స్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫ్పీ, బెన్ సీయర్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 136 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కివీస్ 13.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(45), ఫిన్ అలెన్(38) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మధ్యలో మిచెల్ హే (21) కూడా రాణించడంతో సునాయాసంగా విజయం సాధించింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2 వికెట్లు పడగొట్టగా మహ్మద్ అలీ, కుష్దీల్ షా, జహాందాద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 తేడాతో లీడ్‌లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది.