Sunday, July 13, 2025
HomeఆటBeyond the Border: భారత్ - పాక్ హైవోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధం!

Beyond the Border: భారత్ – పాక్ హైవోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధం!

The Gentlemen’s War: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి.. దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆ గాయం మానక ముందే, భారత త్రివిధ దళాలు నిర్వహించిన ప్రతీకార ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్-పాకిస్థాన్ సంబంధాలు సంధిగ్ధతలో పడ్డాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కుదిరినా, ఆ నిశ్శబ్దం తాత్కాలికమేనని తేలిపోయింది. ఇప్పుడు దాయాది దేశాలు మరో పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి యుద్ధభూమిలో బాంబులు పేలవు, తుపాకుల మోతలు ఉండవు. కేవలం బ్యాట్-బంతి మధ్యే అసలైన సమరం. ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ లెజెండ్స్ మధ్య క్రికెట్ మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సరికొత్త ప్రాధాన్యత పొందిన ఈ హైవోల్టేజ్ పోరు ఎక్కడ? ఎప్పుడు అంటే…?

పహల్గామ్ దాడి నుంచి క్రికెట్ మైదానం వరకు: ఏప్రిల్ 22, 2025న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడంతో భారత్‌లో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి ప్రతీకారంగా, భారత త్రివిధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని చాటాయి. ఉన్నతాధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే, సరిహద్దులో శాంతి నెలకొన్నా, ఇప్పుడు ఈ దాయాది దేశాలు క్రికెట్ మైదానంలో పరాకాష్ట పోరుకు సన్నద్ధమవుతున్నాయి. జూలై 20, 2025న, భారత్-పాకిస్థాన్ లెజెండ్స్ జట్లు మహాయుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్:

- Advertisement -

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 రెండో ఎడిషన్ జూలై 18 నుంచి ఇంగ్లాండ్‌లో జరగనుంది. ఈ టీ20 టోర్నమెంట్‌లో రిటైర్డ్ అంతర్జాతీయ క్రికెటర్లు ఆరు జట్లలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పాటుగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొంటాయి.

భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జూలై 20న ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత లెజెండ్స్ జట్టు జూలై 22న సౌతాఫ్రికాతో (నార్తాంప్టన్), జూలై 26న ఆస్ట్రేలియాతో (లీడ్స్), జూలై 27న ఇంగ్లాండ్‌తో (లీడ్స్), జూలై 29న వెస్టిండీస్‌తో (లీసెస్టర్‌షైర్) తలపడనుంది.

యువరాజ్ vs యూనిస్ – దిగ్గజాల పోరు:

భారత లెజెండ్స్ జట్టుకు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా, పాకిస్థాన్ లెజెండ్స్‌ను యూనిస్ ఖాన్ నడిపిస్తున్నాడు. భారత జట్టులో సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్థాన్ జట్టులో బూమ్ బూమ్ షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఈ రెండు జట్ల మధ్య గత చరిత్ర చూస్తే, భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో 14-1తో తిరుగులేని ఆధిపత్యంతో ఉంది.

భారత్ జోరుగా ఆధిపత్యం – ఈసారీ విజయపరంపర ఖాయమా:

2024లో జరిగిన డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్‌లో భారత లెజెండ్స్ జట్టు పాకిస్థాన్‌ను ఫైనల్‌లో ఓడించి బంగారు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఆధిపత్యం 7 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 7-0, టీ20 వరల్డ్ కప్‌లలో 7-1—పాకిస్థాన్‌పై భారీ ఒత్తిడిని పెంచుతుంది. ఈసారి కూడా యువరాజ్ సేన జోరుగా ఆడి విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. .

రాజకీయ ఉద్రిక్తతల నీడలో క్రికెట్ సమరం:

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా, భారత్ జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది, దీంతో ఈ మ్యాచ్ తటస్థ వేదిక అయిన ఇంగ్లాండ్‌లో జరుగుతోంది. ఐసీసీ ఈవెంట్‌లలో ఇలాంటి హైబ్రిడ్ మోడల్ 2027 వరకు కొనసాగనుంది, దీని ప్రకారం భారత్‌లో జరిగే ఈవెంట్‌లలో పాకిస్థాన్ మ్యాచ్‌లు కూడా తటస్థ వేదికలలో నిర్వహించబడతాయి. రాజకీయ ఉద్రిక్తతల నీడలో జరిగే ఈ క్రికెట్ సమరం అభిమానులను మరింత ఉత్కంఠకు గురిచేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News