Champions Trophy| ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కొంతకాలంగా వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా జరగనున్న ఛాంయన్స్ ట్రోఫీకి తాము రావడం లేదని భారత్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB)తో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చల్లోనూ ప్రతిష్టంబన కలిగింది. దీంతో ఐసీసీ(ICC) పాకిస్తాన్ బోర్డుకు అల్టీమేటం జారీ చేసింది. హైబ్రిడ్ పద్ధతికి అంగీకరించాలని లేదంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ దెబ్బకు పాక్ దిగొచ్చింది.
తటస్థ వేదికగా హైబ్రిడ్ పద్థతిలో మ్యాచులు నిర్వహించేందుకు అంగీకారం తెలిపింది. కానీ ఫైనల్ మ్యాచ్ తమ దేశ రాజధాని లాహోర్(Lahore)లోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా భవిష్యత్‌లో ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా భారత్‌లో ఆడాల్సి వస్తే.. తాము కూడా హైబ్రిడ్ మోడ్‌లోనే ఆడతామని స్పష్టం చేసింది. టోర్నీ నిర్వహణపై ఇవాళ లేదా రేపు ఐసీసీ క్లారిటీ ఇవ్వనుంది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎనిమిది జట్లతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఐసీసీ కసరత్తు చేస్తోంది.