ICC T- 20 Men World Cup: టీ20 పురుషుల ప్రపంచకప్ 2026లో పాల్గొనేందుకు పాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే టోర్నమెంట్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ ఆడబోమని పాక్ స్పష్టం చేసింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దుతో ఐసీసీకి ఆర్థికంగా గట్టి దెబ్బ తగలనుంది.
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సంబంధించి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీలో ఆడేందుకు తమ క్రికెట్ జట్టుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు పాల్గొనబోదని అధికారికంగా ప్రకటించడంతో టోర్నమెంట్ భవితవ్యం సందిగ్ధంలో పడటంతో పాటు.. ఐసీసీకి భారీగా ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశం ఉంది.
ఈ మేరకు పాకిస్థాన్.. అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని.. కానీ, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగదని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం వెనుక కచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు. కానీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల మధ్య.. భారత్- బంగ్లా మధ్య రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు నుంచి బంగ్లా ఫాస్ట్ బౌలర్‌ను విడుదల చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐసీసీ వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంక నుంచి తరలించాలని ఐసీసీని బంగ్లా విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, ఆ దేశం స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది. ఈ క్రమంలో ఐసీసీ చర్యకు నిరసనగానే పాకిస్థాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, భారత్- పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఏ మ్యాచ్‌కు లేనంతగా హై ఓల్టేజ్ మ్యాచ్‌గా పేరుగాంచిన దాయాదుల పోరు ద్వారానే టోర్నమెంట్‌కు ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో భారీ ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో పాక్ నిర్ణయంతో ఐసీసీకి, ప్రసార హక్కుదారులకు షాకింగ్ న్యూస్‌గా మారింది. దీంతో ఐసీసీ మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

