జమ్మూ కశ్మీర్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్ కి గురి చేసింది. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకులపై ఉగ్రవాదులు జరిపిన ఈ దాడికి అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ దాడి చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించిన ఇషాక్ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు లోనయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఘాటుగా స్పందించారు. ఒక దేశ నాయకుడు ఉగ్రవాదాన్ని సమర్థించడం దారుణమని చెప్పాలి. ఇది కేవలం మానవత్వానికి వ్యతిరేకం మాత్రమే కాదు, దేశం అంతటినీ తీవ్ర ప్రమాదంలో నెట్టే విషయం,” అంటూ డానిష్ తీవ్రస్థాయిలో సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. తాను పాక్ లేదా అక్కడి ప్రజల పట్ల వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, కానీ దేశం ప్రస్తుతం ఉగ్రవాద దుశ్చర్యల వల్ల తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. నాయకత్వం శాంతి పరంగా ముందుకు నడిపించాలి. మన దేశం ఎంతకాలం ఉగ్రవాద ముద్రతోనే నడవాలి?” అని డానిష్ ప్రశ్నించారు.
అంతేకాదు తన మతాన్ని బట్టి క్రికెట్ జీవితంలో ఎదురైన వివక్షను కూడా ఈ సందర్భంలో డానిష్ గుర్తుచేశారు. తాను హిందువు అయినందుకు జట్టులో తనను తక్కువ చేస్తూ చూశారని తెలిపారు. అయినప్పటికీ తాను ఎప్పుడూ మానవత్వం వైపే నిలబడతానని తెలిపారు. ఇదిలా ఉండగా పాక్ ప్రభుత్వం ఇప్పటికీ ఈ దాడిపై స్పష్టంగా స్పందించకపోవడంపై కూడా డానిష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశం బాధ్యత లేదనుకుంటే, వెంటనే ఖండించాల్సింది కదా.. ఎందుకు ఆలస్యం.. ఎందుకు మౌనం.. అంటూ షరీఫ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
డానిష్ కనేరియా పాక్ తరఫున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టి మంచి కెరీర్‌ను నమోదు చేసినా, మత వివక్ష కారణంగా అకాలమే క్రికెట్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం మానవ హక్కుల పరంగా పాక్ పాలనపై నిరంతరం విమర్శలు చేస్తూ ముందుంటున్నారు. పహల్గాం ఘటనలో కూడా ఆయన తీరైన విమర్శలు చేశారు.