Shaheen Afridi injury update : వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేస్ బౌలర్, స్టార్ ఆటగాడు షాహీన్ షా అఫ్రిది మోకాలి గాయంతో ఆటకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్‌లో గాయపడిన అతడిని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హుటాహుటిన స్వదేశానికి పిలిపించింది. అసలు ఈ గాయం ఎలా అయింది? దాని తీవ్రత ఎంత? రాబోయే ప్రపంచకప్‌లో షాహీన్ ఆడటంపై నెలకొన్న అనుమానాలేంటి?
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్, బిగ్ బ్యాష్ లీగ్ (BBL)లో షాహీన్ అఫ్రిది బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, బంతిని ఆపే ప్రయత్నంలో షాహీన్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రతపై ఆందోళన నెలకొనడంతో, పీసీబీ వెంటనే స్పందించింది.
పీసీబీ తక్షణ చర్యలు : గాయం సమాచారం తెలియగానే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్రమత్తమైంది. ఆస్ట్రేలియా నుంచి షాహీన్‌ను తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. బుధవారం (డిసెంబర్ 31, 2025) రాత్రి అతను లాహోర్‌కు పయనమయ్యాడు. లాహోర్‌లోని అత్యాధునిక హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అతనికి చికిత్స, పునరావాసం అందించనున్నారు.
ప్రపంచకప్‌పై నీలినీడలు : షాహీన్ గాయం, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. షాహీన్ అఫ్రిది, పాకిస్థాన్ బౌలింగ్ విభాగానికి వెన్నెముక లాంటివాడు. కొత్త బంతితో ప్రత్యర్థిని దెబ్బతీయడంలో అతను సిద్ధహస్తుడు. అతని గాయం నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో, వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతని లభ్యతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అతను ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని, జట్టుకు అందుబాటులో ఉండాలని పాకిస్థాన్ అభిమానులు ఆశిస్తున్నారు.

